రూ. 1.06 కోట్ల విలువైన 213.360 కేజీల గంజాయి స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్
పరవాడ పోలీస్ సిబ్బంది చాకచక్యం: ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,
అనకాపల్లి ముచ్చట్లు:
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాలు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ బి.మోహనరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో పరవాడ సీఐ ఆర్.మల్లికార్జున రావు మరియు సిబ్బంది అంతరాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలు ఉన్న ఒక భారీ గంజాయి అక్రమ రవాణా ముఠాను రట్టు చేశారు. లంకెలపాలెం జంక్షన్ వద్ద సాహసోపేతంగా దాడి చేసి రూ.1,06,68,000/- (ఒక కోటి ఆరు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు) విలువైన 213.360 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా, కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
కేసు వివరాలు మరియు స్వాధీనం చేసుకున్న సొత్తు:
పోలీస్ స్టేషన్: పరవాడ పి.ఎస్ (క్రైమ్ నెం.177/2026)
చట్టపరమైన సెక్షన్లు: 20(b)(ii)(C) r/w 8(c), 25 NDPS Act, 1985, Sec. 3(3) of Passport (Entry into India) Act, 1920 మరియు Sec.12(1)(a) of Passport Act, 1967.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
213.360 కేజీల గంజాయి (విలువ రూ.1,06,68,000/-)
నగదు రూ.95,240/-
ఒక స్విఫ్ట్ డిజైర్ కారు (AP 39 TF 2687)
ఒక హీరో హోండా గ్లామర్ మోటార్ సైకిల్ (AP 16 DF 7410)
4 మొబైల్ ఫోన్లు మరియు ఇతర కీలక పత్రాలు.
విచారణలో వెల్లడైన సంచలన నిజాలు – నిందితుల మోడస్ అపరాండి (Modus Operandi):
అంతర్జాతీయ నేర చరిత్ర (A1): ఈ కేసులో ప్రధాన నిందితుడు (A1) షేక్ అజ్మల్ ఖాన్, స్వస్థలం: తమిళనాడులోని రామనాథపురం జిల్లా (ప్రస్తుతం ఇతని కుటుంబం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నివసిస్తోంది).
అంతర్జాతీయ నేర చరిత్ర: ఇతనికి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. గతంలో శ్రీలంక పోలీస్ నార్కోటిక్స్ బ్యూరో (కొలంబో) అధికారులకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ పరిమాణం: శ్రీలంకలో ఇతను అరెస్ట్ అయిన సమయంలో ఇతని వద్ద నుండి 495 గ్రాముల మెథాంపెటమైన్ (Methamphetamine) మరియు 8.583 కిలోగ్రాముల హాషిష్ (Hashish) లభించాయి.
రిమాండ్: ఈ భారీ అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో ఇతను 2022 నుండి 2025 వరకు శ్రీలంకలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల ‘బూస్సా హై సెక్యూరిటీ జైలు’ (Boossa High Security Prison) లో రిమాండ్ లో ఉన్నాడు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
పాస్‌పోర్ట్ లేకుండా అక్రమ చొరబాటు: శ్రీలంక కోర్టులో బెయిల్ వచ్చినప్పటికీ, పాస్‌పోర్ట్ అక్కడి అధికారుల వద్దే ఉంది. అయినప్పటికీ ఇతను సముద్ర మార్గం (బోటు) ద్వారా అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డాడు. మధ్యలో మళ్లీ ఒకసారి శ్రీలంక కోర్టు విచారణకు వెళ్లి, తిరిగి భారత్‌కు దొంగచాటుగా వచ్చాడని దర్యాప్తులో తేలింది.
అంతరాష్ట్ర నెట్‌వర్క్ సంప్రదింపులు: భారతదేశానికి వచ్చిన తర్వాత ఇతనికి తమిళనాడుకు చెందిన రాజా (A6) అనే డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు తరలించేలా స్కెచ్ వేశారు.
సరుకు సేకరణ: మొదట పెదబయలు మండలం, గోమంగి గ్రామానికి చెందిన శెట్టి రవికుమార్ @ నాని (A5) బృందానికి రూ.6 లక్షలు ఇచ్చి గంజాయి కోసం ప్రయత్నించారు. అక్కడ సరుకు రావడం ఆలస్యం కావడంతో, ప్రత్యామ్నాయంగా ఒడిశా (జనబ ప్రాంతం)కు చెందిన శ్యామ్ (A7) ద్వారా గంజాయిని సేకరించారు. ఇందుకు A1 తమ్ముడు షేక్ అబ్దుల్ రెహమాన్ (A2),
తోలం దుర్గాప్రసాద్ (A3)లు రవాణా ఏర్పాట్లు చూశారు.
రవాణాకు కారు ఏర్పాటు: నిందితుడు కొల్లేజి లోవప్రసాద్ (A4) గంజాయి రవాణా అని తెలిసి కూడా లాభాల కోసం తన స్విఫ్ట్ డిజైర్ కారును ఇచ్చి, స్వయంగా డ్రైవ్ చేస్తూ రవాణాలో పాల్గొన్నాడు.
పోలీసుల మెరుపు దాడి – ఛేదింపు:
16-06-2026 న మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో పరవాడ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ (WSI) శ్రీమతి జి.ఎస్.వి.మహాలక్ష్మి గారి నేతృత్వంలోని ప్రత్యేక బృందం లంకెలపాలెం జంక్షన్ (NH-16) వద్ద నిఘా పెట్టి, వాహన తనిఖీలు చేపట్టింది. నిందితులు పరస్పరం ఫోన్లలో సమాచారం ఇచ్చుకుంటూ పైలట్ బైక్‌తో వస్తుండగా, పోలీసులు అత్యంత చాకచక్యంగా కారును, బైక్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా కారులో భారీగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది.
ఎస్పీ ప్రశంసలు:
మీడియా సమావేశం సాక్షిగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,కేసును విజయవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ఘనంగా అభినందించారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అంతర్జాతీయ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ బి.మోహనరావు, సీఐ ఆర్.మల్లికార్జున రావు, మహిళా ఎస్ఐ జి.ఎస్.వి.మహాలక్ష్మి, మరియు వారి సిబ్బందికి, ఈగల్ టీంకు ఎస్పీ స్వయంగా ప్రశంసా పత్రాలను మరియు నగదు పురస్కారాలను అందజేసి సత్కరించారు.
పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా కొనియాడారు.
ప్రస్తుత స్థితి & తదుపరి చర్యలు:
అరెస్ట్ చేసిన ఐదుగురు నిందితులను (A1 నుండి A5) వైద్య పరీక్షల అనంతరం అనకాపల్లి గౌరవ XI అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నారు.
పరారీలో ఉన్న మిగిలిన నిందితులు (A6 రాజా – చెన్నై, A7 శ్యామ్ – ఒడిశా, మరియు పెదబయలుకు చెందిన ఇతరుల) కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ముఠా వెనుక ఉన్న హవాలా డబ్బు లావాదేవీలు, అంతరాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు సాగుతోంది.
Tags: International drug smuggling gang busted: