June 17, 2026
Explore
ఆకేపాటి వెంటనే రాజీనామా చేయాలి: చమర్తి

ఆకేపాటి వెంటనే రాజీనామా చేయాలి: చమర్తి

June 17, 2026 | Andhra Pradesh

రాజంపేటముచ్చట్లు:

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను దాచిపెట్టి ప్రజలను, ఎన్నికల సంఘాన్ని మోసం చేశారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు ఆరోపించారు. మంగళవారం రాజంపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆకేపాడు గ్రామంలో తన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న కొన్ని భూముల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించలేదని పేర్కొన్నారు. సర్వే నంబర్ 1277/2లో ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న నాలుగు ఎకరాల భూమితో పాటు మరికొన్ని భూములకు సంబంధించిన వివరాలను దాచారని ఆరోపించారు. వేల ఎకరాల భూములను అక్రమంగా కబ్జా చేశారని, ప్రభుత్వ భూములను కూడా తమ పేర్లపై ఆన్‌లైన్ చేసుకున్నారని విమర్శించారు.

అధికారుల నోటీసులకు స్పందించకుండా కోర్టును ఆశ్రయించడం వెనుక కారణమేంటని ప్రశ్నించిన ఆయన, ఎమ్మెల్యే తన తప్పును ఒప్పుకుని వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరంగా పోరాడి అనర్హత వేటు వేయించే వరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.

అయితే ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి స్పందన తెలియాల్సి ఉంది.

Tags;Akepati must resign immediately: Chamarthi