June 16, 2026
Explore
NEET రీ-ఎగ్జాంకు ముందు టెలిగ్రామ్ చానెళ్లపై కేంద్రం బ్యాన్‌.. NTA రియాక్షన్ ఇదే

NEET రీ-ఎగ్జాంకు ముందు టెలిగ్రామ్ చానెళ్లపై కేంద్రం బ్యాన్‌.. NTA రియాక్షన్ ఇదే

June 16, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  • నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై కీలక ఆంక్షలు విధించింది. జూన్ 22 వరకు ప్లాట్‌ఫామ్ యాక్సెస్‌ను పరిమితం చేయడంతో పాటు, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. పేపర్ లీక్ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న ముఠాలను అడ్డుకోవడమే ఈ చర్యల ఉద్దేశమని NTA వెల్లడించింది..
  • న్యూఢిల్లీ, జూన్‌ 16: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌ ఛానెన్లపై తాత్కాలికంగా బ్యాన్‌ విధిస్తూ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో ప్రశ్నాపత్రం లీక్ పేరుతో తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. అలాగే టెలిగ్రామ్‌లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే (Message Editing) ఫీచర్‌ను జూన్ 30 వరకు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ చర్యలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్వాగతించింది. పరీక్ష భద్రత, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

👉పేపర్ లీక్ పేరుతో భారీ మోసాలు

  • గత కొన్ని వారాలుగా “PAPER LEAKED NEET”, “Re-NEET 2026”, “Private Mafia”, “REE NEET MAFIAA” వంటి పేర్లతో టెలిగ్రామ్‌లో పలు ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం తమ వద్ద ఉందంటూ విద్యార్థులు, వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు NTA వెల్లడించింది. ప్రశ్నాపత్రం అందిస్తామంటూ కొందరు అభ్యర్థుల నుంచి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే పరీక్ష ప్రశ్నాపత్రం పూర్తిగా భద్రతా వ్యవస్థలోనే ఉందని, పరీక్షకు ముందు ఎవరూ లీక్‌ చేయలేని విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు NTA స్పష్టం చేసింది. పేపర్ లీక్ అయ్యిందంటూ వస్తున్న ప్రచారాలన్నీ పూర్తిగా నకిలీవేనని పేర్కొంది.
  • టెలిగ్రామ్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ద్వారా ఇప్పటికే పంపిన సందేశాలను తర్వాత సవరించే అవకాశం ఉంటుంది. కొన్ని ముఠాలు ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తూ, పరీక్ష పూర్తయిన తర్వాత అసలు ప్రశ్నాపత్రాన్ని పాత సందేశాల్లో జతచేసి, పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నట్లు NTA తెలిపింది. ఈ తరహా మోసాలను అడ్డుకునేందుకే జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను సైతం నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసు శాఖలు కలిసి ఈ మోసాలపై ఇప్పటికే చర్యలు చేపట్టాయి. బీహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసుల నుంచి వచ్చిన సమాచారంతో పలు టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులు, బాట్లను తొలగించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను అరెస్ట్ చేయగా, వారు సుమారు రూ.1.5 కోట్ల మేర అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు.

👉నీట్‌ అభ్యర్థులకు NTA సూచనలు

  • జూన్ 21న నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని NTA స్పష్టం చేసింది. విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం NTA వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఎవరైనా ప్రశ్నాపత్రం తమ వద్ద ఉందని, డబ్బు చెల్లిస్తే దాన్ని మీకు అందిస్తామంటూ సంప్రదిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని NTA కోరింది. పరీక్షలను నిష్పక్షపాతంగా, భద్రంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చింది. వ్యక్తిగతంగా, టెలిఫోన్ ద్వారా లేదా ఏదైనా ఆన్‌లైన్ వేదిక ద్వారా మోసపూరిత సందేశాలు అందితే వెంటనే జాతీయ సైబర్-క్రైమ్ హెల్ప్‌లైన్‌ 1930 నంబరుకు గానీ, లేదా cybercrime.gov.in లోని జాతీయ సైబర్-క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలని తెలిపింది. దీనితోపాటు NTA వారి సొంత హెల్ప్‌లైన్‌లు 011-40759000 / 011-69227700 నంబరులను సంప్రదించవచ్చు. లేదంటే neetug@nta.ac.inకు కూడా మెయిల్ చేయవచ్చని సూచించింది.

Tags: Centre bans Telegram channels ahead of NEET re-exam; here is the NTA’s reaction.