June 12, 2026
Explore
ప్రియుడితో కలిసి జీవించేందుకు.. పచ్చని సంసారంలో ‘నిప్పులు’ప్రియాంక..

ప్రియుడితో కలిసి జీవించేందుకు.. పచ్చని సంసారంలో ‘నిప్పులు’ప్రియాంక..

June 12, 2026 | Andhra Pradesh

బెంగళూరు ముచ్చట్లు:

ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉందని తన కుమార్తె వెన్నెల (5)ను హత్య చేసిన తల్లి ప్రియాంకను కాడుగోడి ఠాణా పోలీసులు గురువారం హాసనలో అరెస్టు చేసి, నగరానికి తరలించుకొచ్చారు. దావణగెరెకు చెందిన ప్రవీణ్‌- ప్రియాంక 15 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. ప్రవీణ్‌ ఒక ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. కాడుగోడిలో ఉంటున్న సమయంలో తనతో కలిసి పాఠశాలలో చదువుకున్న మోహన్‌ ఆమెను మళ్లీ కలిశాడు. తాను రియల్‌ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తున్నట్లు చెప్పాడు. క్రమంగా ఇద్దరూ మళ్లీ సన్నిహితమయ్యారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం విడదీయరానిదిగా మారింది. ఈ విషయాన్ని ప్రవీణ్‌ గుర్తించి, ఇద్దరినీ హెచ్చరించాడని పోలీసులు వివరించారు.

ఆ క్రమంలోనే.. కుమార్తెను తీసుకుని ఇల్లు వదిలి, మోహన్‌తో సహజీవితాన్ని ప్రారంభించింది. భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. వెన్నెల అనారోగ్యం పాలై మరణించిందని భర్తకు, తన సోదరునికి చెప్పింది. అంత్యక్రియలను పూర్తి చేసింది. మరణోత్తర పరీక్షల నివేదికను భర్తకు పంపించింది. విదేశాల్లో ఉంటున్న ఒక వైద్య స్నేహితునికి ఆ నివేదికను ప్రవీణ్‌ పంపించారు. మరణోత్తర పరీక్ష నివేదిక సమగ్రంగా లేదని చెప్పడంతో అనుమానంతో ప్రియాంకపై ఆయన ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో తీవ్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డ గొంతు నులిమి తల్లి హత్య చేసినట్లు గుర్తించి, మోహన్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ప్రియాంక పరారీలో ఉంది. ఆమె హాసనలో తలదాచుకున్నట్లు గుర్తించి, అరెస్టు చేసి, నగరానికి తీసుకువచ్చి విచారణను ప్రారంభించారు.

ప్రియుడితో మరింత సన్నిహితంగా ఉండటానికి ఆ పాప అడ్డు వస్తోందనే కడతేర్చినట్లు అనుమానిస్తున్నారు. మోహన్‌ మాయమాటలూ ఆమెను తప్పుదారి పట్టించినట్లు గుర్తించారు. కోటీశ్వరుడినంటూ నమ్మబలికిన అతన్ని ఆమె నమ్మింది. బాగా చేరువయ్యాక.. అతని వద్ద ఏమీ లేదని తెలుసుకుని భారంగానే అతనికి సహకారం అందిస్తున్న క్రమంలో ఆమె బిడ్డను పోగొట్టుకోవడం విషాదాంకం. మోహన్‌ కోటీశ్వరుడు కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్‌ అని తేలగా.. ఇపుడీ హత్య కేసులో ఆమె అడ్డంగా దొరికిపోయి బతుకునే చీకటిమయం చేసుకున్న తీరు నెటిజన్ల విమర్శలకు కారణమైంది.

Tags: Priyanka sets her happy family life ablaze to live with her lover.