June 9, 2026
Explore
జనసేనలో ఆపరేషన్ క్లీన్.. క్రమశిక్షణపై పవన్ ఫోకస్

జనసేనలో ఆపరేషన్ క్లీన్.. క్రమశిక్షణపై పవన్ ఫోకస్

June 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో అధికార కూటమి ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఇప్పుడు సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత తన సొంత పార్టీని చక్కదిద్దుకునే పనిని ప్రారంభించారు.

పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన పవన్ కొద్దిరోజులుగా ఆ అంశంపై సీరియస్ గా ఫోకస్ చేశారని అంటున్నారు.

పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారితోపాటు గ్రూపు రాజకీయాలకు పాల్పడే నేతలకు పవన్ క్లాస్ పీకుతున్నారు.

ఇదే లాస్ట్ ఛాన్స్ అనే హెచ్చరికలు పంపుతున్నట్లు చెబుతున్నారు.

రెండు జిల్లాల కమిటీలు రద్దు

గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ క్షేత్రస్థాయి సమస్యపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ప్రభుత్వ బాధ్యతలతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం దెబ్బతినకుండా ఉండేందుకు ఆయన గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగానే రెండు ఉమ్మడి ఒంగోలు, ప్రకాశం జిల్లాల కమిటీలను పూర్తిగా రద్దు చేసినట్లు చెబుతున్నారు.

ఆ రెండు జిల్లాల్లో పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న అధినేత పవన్ చాలా కాలం నుంచి చక్కదిద్దుకోవాలని సుతిమెత్తగా చెబుతున్నా, వినిపించుకోకపోవడంతో పార్టీ పదవుల నుంచి తప్పించినట్లు చెబుతున్నారు.

ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు.

కేవలం జిల్లా కమిటీనే కాకుండా, ఆ జిల్లా పరిధిలో నగర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ సమూలంగా రద్దు చేస్తూ అధినేత పవన్ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా నేతల్లో క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోవడం, పార్టీ విధివిధానాలకు భిన్నంగా కొందరు నేతల వైఖరి ఉండటమే దీనికి ప్రధాన కారణమని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది.

నేతల ప్రవర్తన వల్ల క్షేత్రస్థాయిలో కష్టపడే జన సైనికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో పవన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ప్రకాశం జిల్లా కమిటీపై ముందే యాక్షన్

ఇక నెల్లూరు కంటే ముందే గత నెలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీపై కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి కఠిన నిర్ణయమే తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు.

ఒంగోలు డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రకాశం జిల్లా కమిటీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపం తీవ్రస్థాయికి చేరడంతో ఆ కమిటీని కూడా రద్దు చేశారని అంటున్నారు.

కమిటీలో 28 మంది ఉంటే 56 గొడవలు పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కేంద్ర కార్యాలయం చేతుల్లోకి పగ్గాలు

కమిటీలు రద్దయిన నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొత్త కార్యవర్గాలను నియమించేంత వరకు పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయమే నేరుగా చూసుకోనుందని చెబుతున్నారు.

సమర్థులైన నేతలకు బాధ్యతలు అప్పగించే వరకు ఆయా జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.

దీనివల్ల గ్రూపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందని పవన్ భావిస్తున్నారని అంటున్నారు.

కొంతకాలం నేతల తీరును పరిశీలించిన తర్వాత అందరినీ కలుపుకుని వెళ్లే నాయకులకు బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు.

పవన్ మార్క్ పాలిటిక్స్

సాధారణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా అంతర్గత గొడవలను పెద్దగా పట్టించుకోదు.

కానీ పవన్ కళ్యాణ్ భిన్నమైన శైలిని ప్రదర్శిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండటంతో పాటు, పార్టీలో క్రమశిక్షణే పరమావధి అని ఆయన సంకేతాలిస్తున్నారని చెబుతున్నారు.

అధికార ఉందని ఇష్టానుసారం పనిచేస్తే సొంత పార్టీ వారినైనా క్షమించేది లేదని ఈ నిర్ణయాల ద్వారా పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారని అంటున్నారు.

ఈ ‘రిపేర్లు’ త్వరలోనే మరికొన్ని జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం ఉందనే చర్చ జనసేనలో హాట్ పెంచేస్తోందని అంటున్నారు.

Tags: ‘Operation Clean’ in Janasena: Pawan focuses on discipline.