మదనపల్లెలో పోలీసుల ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ సూపర్ హిట్!
మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మదనపల్లెలో ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ ఆదివారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘ఫిట్ ఇండియా’ ఉద్యమం, ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ.. పట్టణంలోని మల్లికార్జున సర్కిల్ వరకూ కోలాహలంగా సాగింది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’, ‘ఫిట్ బాడీ-ఫిట్ మైండ్-ఫిట్ నేషన్’ అనే స్ఫూర్తిదాయక నినాదాలతో ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లారు. నిత్య జీవితంలో వ్యాయామం, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలని, తద్వారా శారీరక, మానసిక దృఢత్వం సాధ్యమవుతుందని ఈ ర్యాలీ ద్వారా పోలీసులు సందేశమిచ్చారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, పర్యావరణానికి మేలు చేసే సైకిల్ వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలిచే పోలీసు శాఖ.. తమ సిబ్బందితో పాటు ప్రజల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎంతటి ప్రత్యేక దృష్టి సారిస్తుందో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటిచెప్పారు. ఈ సైకిల్ ర్యాలీలో పోలీసు అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మదనపల్లె ఒకటో పట్టణ సీఐ శ్రీ రాజారెడ్డి, ఆర్ఎస్ఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మక్బుల్ తదితర సిబ్బంది ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
Tags: Let’s ride bicycles… and achieve complete health.