- తిరుపతి నగరంలో మెగా డ్రగ్స్ టెస్టింగ్ కార్యక్రమం నిర్వహణ.
- గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక దండయాత్ర.
- రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులకు కౌన్సిలింగ్ – సన్మార్గంలో నడవాలని సూచన
- మత్తు పదార్థాల వినియోగదారులను గుర్తించి కౌన్సిలింగ్‌కు చర్యలు.
- “డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యంతో నిరంతర ప్రత్యేక కార్యాచరణ.
తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఈగల్ సెల్ సిబ్బంది పాల్గొని ఈరోజు తిరుపతి నగరంలోని ఇందిరా మైదానంలో “డ్రగ్స్ పై దండయాత్ర” కార్యక్రమంలో భాగంగా మెగా డ్రగ్స్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనుమానిత వ్యక్తులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించి, మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా తిరుపతి సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులు (సస్పెక్ట్స్) మరియు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులను ఇందిరా మైదానానికి పిలిపించి ప్రత్యేక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. వారి ప్రవర్తన, జీవన విధానం, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి చట్టబద్ధమైన జీవితం గడపాలని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడంతో పాటు, కుటుంబ సంక్షేమం, జీవనోపాధి మరియు వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులకు చట్టపరమైన చర్యలతో పాటు కౌన్సిలింగ్ అందించి, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ వారిని సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువత విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 (ఈగల్) లేదా 112 కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే “డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా” లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలమని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఈగల్ సెల్ సీఐ, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Stay away from drugs – safeguard your future.