June 5, 2026
Explore
ప్రేమ పేరుతో మోసం… పుట్టిన గంటల్లోనే అనాథగా మారిన పసికందు!

ప్రేమ పేరుతో మోసం… పుట్టిన గంటల్లోనే అనాథగా మారిన పసికందు!

June 5, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ వ్యక్తి బాధ్యత నుంచి తప్పించుకోగా, సమాజానికి భయపడ్డ కుటుంబం నవజాత శిశువును ఆసుపత్రి బెడ్‌పైనే వదిలేసి వెళ్లిపోయిన ఘటన కలచివేస్తోంది.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం తంబళ్లపల్లెకు వచ్చి భవన నిర్మాణ పనులు చేస్తోంది. ఈ కుటుంబంలోని యువతిని బంధువైన రామలింగ ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసినట్లు సమాచారం. పెళ్లి చేస్తానని చెప్పి ఆమెను గర్భవతిని చేసిన అనంతరం అతడు ముఖం చాటేయడంతో యువతి జీవితమే ప్రశ్నార్థకంగా మారింది.

మంగళవారం పురిటి నొప్పులతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన యువతి, బుధవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టిందన్న అవమానం, సమాజం ఏమనుకుంటుందోననే భయం ఆ కుటుంబాన్ని కఠిన నిర్ణయం తీసుకునేలా చేసింది. కన్నబిడ్డను ఆసుపత్రి మంచంపైనే వదిలేసి, బాలింత అయిన కూతురిని తీసుకుని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.

ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), ICDS అధికారులు వెంటనే స్పందించి పసికందును తమ సంరక్షణలోకి తీసుకున్నారు. తల్లి లేదా కుటుంబ సభ్యులు తిరిగి రాకపోతే ఆ చిన్నారిని శిశు విహార్‌కు అప్పగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తప్పు చేసిన వ్యక్తి బాధ్యత లేకుండా తప్పించుకుంటే… ఏ తప్పూ చేయని పసికందు పుట్టిన కొన్ని గంటల్లోనే అనాథగా మారడం సమాజానికి మచ్చగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags; Deception in the name of love… an infant left orphaned within hours of birth!