June 4, 2026
Explore
విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం

విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం

June 4, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • – స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి.
  • గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
  • పాఠశాలల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై అప్రమత్తంగా ఉండాలి.
  • పోలీస్ శాఖతో సమన్వయంగా విద్యార్థుల భద్రతకు కృషి చేయాలని పిలుపు.
  • విద్యార్థుల భద్రతకు పాఠశాల యాజమాన్యాల సహకారం అవసరం.

ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నియమాల అమలు మరియు పాఠశాల రవాణా వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వై కన్వెన్షన్ హాల్‌లో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు మరియు వాహన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

స్కూల్ బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉండాలి
ఈ సందర్భంగా రేణిగుంట సీఐ జయచంద్ర మాట్లాడుతూ, విద్యార్థులను రవాణా చేసే ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్‌తో పాటు సంబంధిత అన్ని అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. బస్సులను ఎల్లప్పుడూ సురక్షితమైన స్థితిలో నిర్వహించడంతో పాటు డ్రైవర్లు, అటెండెంట్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు ఉన్న వ్యక్తులను డ్రైవర్లుగా నియమించరాదని హెచ్చరించారు.

గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి
పిల్లలపై జరుగుతున్న నేరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పిల్లలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా యాజమాన్యాలు పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించి, ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసులకు తెలియజేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులతో నిరంతర సమీక్ష సమావేశాలు నిర్వహించాలి
ప్రతి 15 రోజులకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల ప్రవర్తన, విద్యా పురోగతి మరియు భద్రత అంశాలపై చర్చించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖ మధ్య సమన్వయం ఉంటే విద్యార్థులకు సురక్షితమైన మరియు క్రమశిక్షణతో కూడిన వాతావరణం కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు.

మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
పాఠశాలల పరిసర ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాలు లేదా ఇతర వ్యాపార సంస్థల్లో విద్యార్థులకు మత్తు పదార్థాలు, హానికర వస్తువులు అందుబాటులో లేకుండా యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ మరియు ఉత్తమ భవిష్యత్తు కోసం పాఠశాల యాజమాన్యాలన్నీ పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని సీఐ జయచంద్ర పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని కోడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, రేణిగుంట, గాజులమండ్యం, ఏర్పేడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, వాహన నిర్వాహకులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Student safety is the top priority.