June 4, 2026
Explore
జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు

జనాభా లెక్కల పేరిట సైబర్ మోసాలు

June 4, 2026 | Andhra Pradesh

: – అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ముచ్చట్లు:

ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారని, ప్రస్తుతం జనాభా లెక్కల (సెన్సస్) పేరుతో సాగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటీవలి కాలంలో సైబర్ కేటుగాళ్లు జనాభా లెక్కల నమోదు అధికారులమంటూ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ లింకుల ద్వారా ప్రజలను సంప్రదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిజిటల్ సర్వే చేస్తున్నామని నమ్మిస్తూ.. ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించి, ఆపై మీ మొబైల్ నంబర్లకు వచ్చే ఓటీపీలను అడిగి క్షణాల్లో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఎన్నడూ ఫోన్లలో గానీ, అనుమానాస్పద లింకుల ద్వారా గానీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు అడగరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఎటువంటి అపరిచిత లింకులపై క్లిక్ చేయవద్దని, ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి సైబర్ మాయగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే అంత వేగంగా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని, ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ గారు స్పష్టం చేశారు.

Tags:Cyber ​​Frauds in the Name of the Census