చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి..
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి తీసుకెళ్లారు. స్వయంగా అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులపై వేధింపులు, గృహహింస, భూవివాదాలు, నకిలీ పత్రాల సృష్టి, అధిక వడ్డీల వేధింపులు, ఆన్‌లైన్ మరియు ప్రేమ పేరుతో జరిగిన మోసాలపై బాధితులు ఎస్పీ కి స్వేచ్ఛగా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సంబంధిత అధికారులతో అప్పటికప్పుడే ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు చట్ట పరిధిలో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను వెంటనే జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి తక్షణమే విచారణ జరపాలని అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని వారు తమ స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయాల్లో సైతం ఫిర్యాదు చేయవచ్చని, ఆయా ఫిర్యాదులను కూడా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీలుగానే పరిగణించి సకాలంలో న్యాయం చేస్తామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలకు భరోసా ఇచ్చారు.
Tags; The goal is immediate justice for the victims.