June 1, 2026
Explore
“డ్రగ్స్ పై దండయాత్ర–2.0” కార్యక్రమం

“డ్రగ్స్ పై దండయాత్ర–2.0” కార్యక్రమం

June 1, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • “డ్రగ్స్ పై దండయాత్ర–2.0” కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక డ్రగ్ అవగాహన మరియు పరీక్షా కార్యక్రమం.
  • “పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం” నినాదంతో గంజాయి గుర్తింపు పరీక్షలు.
  • మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం కోరిన పోలీసులు.

పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సిలింగ్, పునరావాసం – పునరావృతమైతే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.తిరుపతి జిల్లా : గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సూచనలతో, అదనపు ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసరావు నేతృత్వంలో, రేణిగుంట సబ్-డివిజన్ పోలీసు అధికారి వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న “డ్రగ్స్ పై దండయాత్ర–2.0” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామ సమీపంలోని పుష్పిత్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ప్రత్యేక డ్రగ్ అవగాహన మరియు డ్రగ్ డిటెక్షన్ కార్యక్రమం నిర్వహించబడింది.

“పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రగ్ డిటెక్షన్ బస్సు మరియు గంజాయి వినియోగాన్ని గుర్తించే ఆధునిక పరీక్షా కిట్ల సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మేర్లపాక గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మందికి గంజాయి గుర్తింపు పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా మరియు విక్రయాలపై తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, నిర్మూలన దిశగా కఠిన చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.

సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే 1972 (టోల్ ఫ్రీ )కి లేదా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

డ్రగ్ పరీక్షల్లో మొదటిసారి పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులకు తగిన కౌన్సిలింగ్ అందించి, అవసరమైతే పునరావాస కేంద్రాలకు (రిహాబిలిటేషన్ సెంటర్లకు) తరలించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే వ్యక్తి రెండోసారి కూడా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, ఏర్పేడు ఇన్‌స్పెక్టర్ శ్రీకాంతరెడ్డి, ఏర్పేడు ఎస్‌ఐ రవిప్రకాష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పుష్పిత్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం సహకారంతో సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి. రామకృష్ణాచారి మరియు సంస్థ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Tags; “Crusade Against Drugs – 2.0” Program