తిరుపతి ముచ్చట్లు:
- “మీ భద్రత మా బాధ్యత” నినాదంతో మహిళలకు ప్రత్యేక అవగాహన.
- శక్తి యాప్, డయల్- 112, 1930, 181 సేవలపై వివరాలు.
- సైబర్ నేరాలు, మహిళల హక్కులు, బాల్య వివాహాలు, పోక్సో చట్టంపై చైతన్యం.
- మహిళల భద్రత, సాధికారత మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, ఈరోజు శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని “టీఐఎల్ ఇండియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ, శ్రీసిటీ, చెరివి గ్రామం, సత్యవేడు మండలంలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించబడింది. మహిళల రక్షణ, భద్రత మరియు సాధికారతను లక్ష్యంగా చేసుకుని “మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీ సిటీ డీస్పీ బి.వి. శ్రీనివాసులు శ్రీ సిటీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. ప్రియాంక హాజరై, కంపెనీ యాజమాన్యం సహకారంతో మహిళా ఉద్యోగులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ బి.వి. శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, మహిళల హక్కులు, రోడ్డు భద్రత మరియు కుటుంబంలో తల్లిదండ్రుల బాధ్యతలపై అవగాహన కల్పించారు.
మహిళలు తమకు ఎటువంటి వేధింపులు, అన్యాయాలు లేదా అసౌకర్య పరిస్థితులు ఎదురైన వెంటనే పోలీసులను లేదా సంబంధిత సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించాలని సూచించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సాధికారత సమాజ అభ్యున్నతికి పునాది అని పేర్కొన్నారు.
అనంతరం శ్రీ సిటీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం. ప్రియాంక మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షలు, వ్యక్తిగత భద్రత, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే మహిళలు మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడం, స్వీయ రక్షణపై అవగాహన కలిగి ఉండడం, హింస లేదా వేధింపుల విషయంలో మౌనంగా ఉండకుండా ధైర్యంగా స్వరం వినిపించడం, కుటుంబంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి అంశాలపై చైతన్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు డ్రగ్స్ మరియు గంజాయి వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్, డయల్-112, సైబర్ హెల్ప్‌లైన్ 1930, మహిళా హెల్ప్‌లైన్ 181 సేవల వినియోగంపై కూడా సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో టీఐఎల్ ఇండియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం, మహిళా ఉద్యోగులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Awareness Session on Women’s Safety Conducted at Sri City.