జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్థులకు పోలీసు అధికారుల కౌన్సిలింగ్..
మదనపల్లి ముచ్చట్లు:
జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, నేరాల నియంత్రణే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్థులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు రౌడీషీటర్లను పిలిపించి వారి ప్రస్తుత జీవన విధానం, కదలికలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సత్ప్రవర్తనతో మెలగాలంటూ వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
భవిష్యత్తులో ఎలాంటి అసాంఘిక, క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. పాత నేరస్థులు, సమాజానికి ఇబ్బంది కలిగించే వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకోవాలని, చట్టవిరుద్ధమైన పనులకు దూరంగా ఉంటూ సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చట్టాల ప్రకారం కేసులు నమోదుచేస్తామని, మళ్లీ పాత నేరాల బాట పడితే జైలు శిక్షలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్కరి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Tags:If criminal tendencies are not abandoned, strict action is inevitable.