అమరావతిముచ్చట్లు:
మొత్తం 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు
జూన్ పెన్షన్ల కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
కొత్త పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్ల కేటాయింపు
కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,886 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించి కొత్తగా 5,606 మందికి స్పౌజ్ కేటగిరీ కింద వితంతు పెన్షన్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సెర్ప్, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2,728 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా మంజూరు చేసిన 5,606 పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారుడు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి వెంటనే అదే నెల నుంచి పెన్షన్‌ను బదిలీ చేసేలా స్పౌజ్ కేటగిరీని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జూన్‌తో కలుపుకుని ఇప్పటివరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ.65,886 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. జూన్ 1వ తేదీ ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Tags: Rs 2,728 Crore Released for June Pensions in AP; 5,606 New Beneficiaries