తిరుపతి ముచ్చట్లు:
- చోరీ జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన తిరుపతి క్రైమ్ పోలీసులు.
- రూ.28.16 లక్షల విలువైన 177.6 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం.
- నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, మొదలగునవి స్వాధీనం.
తిరుపతి నగరంలో సంచలనం కలిగించిన ఇంటి చోరీ కేసును జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (క్రైమ్స్) ఏ. శ్రీనివాసులు , తిరుపతి క్రైమ్ సీఐ ఎన్. శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో తిరుపతి క్రైమ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.చోరీకి గురైన రూ.28,16,000 విలువైన 177.6 గ్రాముల బంగారు ఆభరణాలను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, ఇంటి తాళం చెవి, స్క్రూడ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టు చేసిన నిందితుడు అన్యం పృథ్వీ (20), చెన్నారెడ్డి కాలనీ, తిరుపతి అర్బన్ మండలానికి చెందినవాడు. తనపై ఉన్న కుటుంబ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సొంత పెద్దమ్మ నివాసాన్నే లక్ష్యంగా ఎంచుకుని చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
- కేసు వివరాలు.
తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలతో వేగవంతమైన దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం, అనుమానితుల కదలికలు, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తూ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని విచారణ కొనసాగించారు.
- చోరీ చేసిన విధానం.
ఈ నెల 28వ తేదీన ఇంటి యజమానులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన విషయాన్ని గమనించిన నిందితుడు, ముందుగానే తన వద్ద ఉన్న తాళం చెవితో ఇంటిలోకి ప్రవేశించాడు. అనంతరం బెడ్‌రూమ్‌లోని బీరువా సేఫ్‌ను స్క్రూడ్రైవర్ సహాయంతో బలవంతంగా తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించాడు. అనంతరం ఎవరూ అనుమానించకుండా కుటుంబ సభ్యులతో సాధారణంగా వ్యవహరిస్తూ తనపై అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.
- ఇలా పట్టుబడ్డాడు.
ఈ రోజు (30-05-2026) హరే రామ హరే కృష్ణ రోడ్డు, అలిపిరి సమీపంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా నిందితుడు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాలపై విచారణ చేపట్టగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మొత్తం 177.6 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, ఇంటి తాళం చెవి, స్క్రూడ్రైవర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నేరానికి కారణం
పోలీసుల విచారణలో నిందితుడు మద్యం సేవించడం, ధూమపానం వంటి వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. చోరీ చేసిన ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు.చోరీ జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేసి, పూర్తి స్థాయిలో ఆస్తులను రికవరీ చేసిన తిరుపతి క్రైమ్ పోలీసుల పనితీరును జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అభినందించారు.
- ప్రజలకు పోలీసుల సూచనలు.
- విలువైన బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లు లేదా సురక్షిత ప్రదేశాలలో భద్రపరచుకోవాలి.
- ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి.
- అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.
- ఎల్‌హెచ్‌ఎంఎస్ (LHMS) సేవలను వినియోగించుకుని పోలీసుల సహకారం పొందాలని సూచించారు.
Tags: Young man arrested for committing theft at a relative’s house.