May 30, 2026
Explore
భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ..

భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ..

May 30, 2026 | Andhra Pradesh

జీవిత భాగస్వాముల త్యాగం వెలకట్టలేనిదన్న అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ముచ్చట్లు:

సమాజ రక్షణ కోసం దశాబ్దాల కాలం పాటు అంకితభావంతో పనిచేసి, ప్రజలకు సేవలందించిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కొనియాడారు. శనివారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో మే నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు ఏఎస్ఐలకు జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఒక పోలీసు అధికారి సుదీర్ఘ సర్వీసు పూర్తి చేయడంలో వారి జీవిత భాగస్వామి పాత్ర, భాగస్వామ్యం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నాటి రోజుల్లో నేటి వలె అత్యాధునిక వసతులు లేకపోయినా, రకరకాల ఇబ్బందులను తట్టుకుని, కుటుంబానికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడంలో సతీమణులు అందించిన సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ని రోజులు విధి నిర్వహణకే అంకితమై సమయాన్ని, శక్తిని వినియోగించారని, ఇకపై శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి సంతోషంతో, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు.

పదవీ విరమణ పొందిన వారిలో కలికిరి పీఎస్ ఏఎస్ఐ ఎస్. మాబూ సాహెబ్ (35 ఏళ్ల సర్వీస్), రామాపురం పీఎస్ ఏఎస్ఐ పి. వెంకటరమణ (35 ఏళ్ల సర్వీస్), మరియు రైల్వేకోడూరు పీఎస్ ఏఎస్ఐ ఎం. శేఖర్ రావు (33 ఏళ్ల సర్వీస్) ఉన్నారు. వీరికి ఎస్పీ జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

దశాబ్దాలుగా మమేకమైన పోలీసు శాఖను, తోటి సిబ్బందిని వదిలి వెళ్తుండటంతో అటు సంతోషం, ఇటు దుఃఖం కలగలిసిన భావోద్వేగాల నడుమ రిటైర్డ్ అధికారులు కన్నీరు కార్చారు. తమను ఇంత గౌరవంగా సత్కరించడం జీవితంలో మరువలేమంటూ ఎస్పీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని ఎస్పీ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి , ఏఏఓ పి. శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఎం. రవికుమార్, కె. సురేష్ కుమార్ రెడ్డి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Three ASIs Retire Amidst Emotional Moments