చేవెళ్ల గడ్డపై కన్నీటి గాయం.. గొంతు కోసి కాళ్లు నరికి మహిళ హత్య
రంగారెడ్డి ముచ్చట్లు:
ఆభరణాలపై ఆశ మానవత్వాన్ని మింగేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కలకలం రేపింది. కడియాలు, చెవి కమ్మల కోసం ఓ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆమె కాళ్లను నరికేసిన అమానుష ఘటన సమాజాన్ని కలచివేస్తోంది. పసిడి కోసం ప్రాణాలనే బలి తీసుకున్న ఈ మృగత్వం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామం ధర్మసాగర్‌కు చెందిన ఎరుకుల మైసమ్మ (48) కొన్నేళ్ల క్రితమే భర్తను కోల్పోయి, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కొడుకు సురేశ్‌కు వివాహం కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.
మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మైసమ్మ తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు మైసమ్మేనని గుర్తించారు.
ప్రాథమిక విచారణలో దుండగులు మైసమ్మను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేసినట్లు తేలింది. అంతేకాకుండా ఆమె కాళ్లలో ఉన్న సుమారు 50 తులాల కడియాలు, చెవి కమ్మల కోసం రెండు కాళ్లను నరికి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తాగిన మత్తులో ఉన్న వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ భూపాల్‌శ్రీధర్ తెలిపారు. విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
“పసిడి కోసం ప్రాణం అంత చులకనా?.. మానవత్వం ఎటు పోతోంది?” అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల గడ్డపై చోటుచేసుకున్న ఈ ఘటన ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.
Tags; The brutality that severed the very legs that walked—butchers who took a life for the sake of a pair of anklets!