May 27, 2026
Explore
మోహినీ రూపంలో మురిపించిన శ్రీ గోవిందరాజస్వామి

మోహినీ రూపంలో మురిపించిన శ్రీ గోవిందరాజస్వామి

May 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

సమ్మోహన అవతారంలో భక్తులకు అభయప్రదానం చేసిన గోవిందుడు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకిపై మోహినీ అవతారంలో విహరించి భక్తులను కటాక్షించారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం భక్తి పారవశ్యంతో సాగింది. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.

అమృతాన్ని ప్రసాదించిన మోహినీ అవతారం

సురులను రక్షించి ధర్మాన్ని స్థాపించిన శ్రీహరి

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో అత్యంత రమణీయంగా వర్ణించబడింది. అమృతం కోసం సురాసురులు క్షీరసాగర మథనం చేయగా, అమృత విభజనలో కలహం చెలరేగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు మోహినీ రూపంలో అవతరించి అసురులను సమ్మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని అందించాడు.

ధర్మరక్షణ కోసం దివ్య మాయారూపంలో అవతరించిన శ్రీహరి, ఈ మోహినీ అవతారంతో భక్తులకు లోకక్షేమ సందేశాన్ని అందించారు.

స్నపన తిరుమంజనంలో ఆధ్యాత్మిక వైభవం

ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి విశేష పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టిటిడి డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఏవీఎస్వో ఆర్. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయరావు, రంజిత్‌, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags; Sri Govindaraja Swamy, enchanting in the guise of Mohini.