March 20, 2026
Explore
గల్ఫ్ గజగజ…ఖతార్లోని కీలక రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు

గల్ఫ్ గజగజ…ఖతార్లోని కీలక రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు

March 20, 2026 | Andhra Pradesh

దుబాయ్ ముచ్చట్లు:

నౌకలపైకీ క్షిపణులు, డ్రోన్లు..ఇజ్రాయెల్ ఉత్తర విద్యుత్ గ్రిడ్ పైనా దాడి..

లక్షల మంది షెల్టర్ లోకి సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ప్రతీకారం

ప్రపంచ దేశాల్లో కలవరం..118 డాలర్లకు చేరిన చమురు ధర

ప్రపంచ స్టాక్ మార్కెట్ల భారీ పతనం…పశ్చిమాసియాకు అమెరికా సైనికుల తరలింపు?

  • ఇరాన్ దాడులను ఖండించిన సౌదీ, యూఏఈ…ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన ఖతార్* పలు దేశాల నేతలతో మాట్లాడిన మోదీ

పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరింది. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై గురువారం ఇరాన్ చేసిన భీకర దాడులు కల్లోలం రేపాయి. పలు రిఫైనరీలు మంటల్లో చిక్కుకున్నాయి. నౌకలపైనా ఇరాన్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్పై వరుస దాడులు చేసింది. అత్యంత కీలకమైన చమురు వ్యవస్థలపై దాడులతో ప్రపంచ దేశాల్లో కల్లోలం రేగింది. బ్యారెల్ ముడి చమురు ధర ఒక దశలో 118 డాలర్లకు చేరింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే భారత్లో రూ. 12.87 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మరోవైపు పశ్చిమాసియాకు వేల మంది సైనికులను పంపాలని అమెరికా నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు మరింత కలవరం రేపాయి. భూతల పోరు మొదలైతే యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అనే ఆందోళనలు పెరిగాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో చమురు క్షేత్రాలపై దాడులు మరింత వణుకు పుట్టిస్తున్నాయి.

డ్రోన్లు, క్షిపణుల మోత మధ్యే శుక్రవారం రంజాన్ జరుపుకోవడానికి గల్ఫ్ దేశాలు సిద్ధమయ్యాయి.

యుద్ధం ప్రారంభమయ్యాక తొలిసారి ఉత్తర ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. కాస్పియన్ సముద్రంలోని నౌకలు, పోర్టు, కమాండ్ కేంద్రంపై దాడి చేశామంది.

ఇరాన్లో మరింత లోతుల్లోకి వెళ్లి దాడులు చేస్తున్నామని అమెరికా చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. హర్మూజ్లో ఇరాన్ బోట్లను యుద్ధ విమానాలు వేటాడుతున్నాయని తెలిపారు. ఇరాన్ భవిష్యత్తు అమెరికా సైన్యం చేతిలో ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.

లెబనాన్ సరిహద్దుల్లో ఇళ్లను లూటీ చేస్తున్న వీడియోలను ఇజ్రాయెల్ సైనికులు స్వయంగా తీసుకున్నారు. గతంలో గాజాలోనూ ఇలాగే చేశారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో ఏప్రిల్ ఆఖరు వరకూ దుబాయ్, రియాద్లకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు క్యాతీ పసిఫిక్ వెల్లడించింది.

గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలన్నీ కలిసి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘హర్మూజ్లో సురక్షిత రవాణాకు సరైన చర్యలు చేపట్టడానికి సహకరిస్తాం. చమురు క్షేత్రాలు, పౌర లక్ష్యాలపై దాడులను వెంటనే ఆపాలి’ అని స్పష్టం చేశాయి. హర్మూజ్లో ఎలాంటి పాత్రకు సిద్ధమనే విషయాన్ని మాత్రం ఆ దేశాలు వెల్లడించలేదు.

ట్రంప్తో భేటీ సందర్భంగా హర్మూజ్లో సహకారానికి జపాన్ ప్రధాని తకాయిచీ సమ్మతించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ట్రంప్ ప్రపంచ శాంతిని కాపాడగలరని అభిప్రాయపడ్డారు.

సౌత్ పార్స్పై దాడితో..

ఇరాన్లో 80% విద్యుత్తు ఉత్పత్తి సహజ వాయువు ద్వారానే జరుగుతుంది. దీంతోపాటు ఇళ్లలో వంటలకు దీనినే వినియోగిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్ ఖతార్తో కలిసి నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం నుంచి ఈ గ్యాస్ సరఫరా అవుతుంది. దీనిపై ఇజ్రాయెల్ బుధవారం దాడి చేయడంతో భారీ నష్టం జరిగింది. ఇదే మరింత చిచ్చు పెట్టింది. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులకు ఇరాను పురిగొల్పింది. దీంతో పరిస్థితి అల్లకల్లోమైంది. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు వద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. సౌత్ పార్స్పై మరోసారి ఇజ్రాయెల్ దాడి చేయకూడదని స్పష్టం చేశారు. ఖతార్ చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు.

ఖండించిన సౌదీ, ఖతార్, యూఏఈ

ఇరాన్దాడులను సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఖండించాయి. ఇదో ప్రమాదకర చర్యని అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబౌల్ ఘీత్ వ్యాఖ్యానించారు. పలువురు ఇరాన్ దౌత్యవేత్తలను ఖతార్ బహిష్కరించింది. ఇరాన్పై ఉన్న కొద్ది విశ్వాసమూ పోయిందని సౌదీ అరేబియా వ్యాఖ్యానించింది. తమకు సైనిక శక్తి ఉందని పేర్కొంది. కాల్పుల విరమణకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పిలుపునిచ్చారు. ఆయుధాలు నిశ్శబ్దమైనప్పుడే గొప్ప ఒప్పందం కుదురుతుందని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ స్పష్టం చేశారు.

పెరిగిన ముడి చమురు ధర

చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులతో ముడి చమురు ధర గురువారం ఒక దశలో 118 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత తగ్గింది. సహజ వాయువు ధర 17% ఎగబాకింది. ఇంధన ధరలను కట్టడి చేయడానికి శతాబ్దాలనాటి షిప్పింగ్ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా నిలిపేశారు. దీనివల్ల విదేశీ జెండాలతో వెళ్లే నౌకల రవాణాపై నిషేధం ఉండదు.

అమెరికాకు చెందిన ఎఫ్35 యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దీంతో అది అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రాణనష్టం జరగలేదు.

హర్మూజ్ జల సంధి నుంచి నౌకలు రాకపోకలు సాగించాలంటే ఇకపై కొంత రుసుము చెల్లించాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఆ నౌకలపై టోల్ విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ చట్టసభసభ్యుడు ఒకరు పేర్కొన్నారు.

మెక్రాన్తో మోదీ చర్చలు

పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై గురువారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గాలని, శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షించారు. హర్మూజ్ జల సంధిద్వారా నౌకల రవాణా సురక్షితంగా సాగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్య పరిష్కారం గురించి మెక్రాన్తో మాట్లాడినట్లు ఎక్స్లో మోదీ పేర్కొన్నారు.

జోర్డాన్ కింగ్ అబ్దుల్లా-2తో ప్రధాని మోదీ మాట్లాడారు. చర్చలే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఖతార్ అమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితోనూ మాట్లాడారు.

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను భారత్ విదేశాంగశాఖ మంత్రి జైశంకర్కు ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి గిడియాన్ సార్ వివరించారు. ‘మేం భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గౌరవిస్తాం’ అని ఫోన్లో చర్చల సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఇరాన్లో చిక్కుకున్న 880 మంది భారతీయులు స్వదేశానికి పయనమవుతున్నారు. గురువారం ఆర్మేనియా, అజర్బైజాన్ మీదుగా 280 మంది భారత్కు చేరుకున్నారు.

200 బిలియన్ డాలర్లు ఇవ్వండి

ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై భీకర యుద్ధం చేస్తున్న అమెరికా.. భారీగా ఖర్చు పెడుతోంది. ఇప్పటికే రూ.వేల కోట్ల విలువైన ఆయుధాలను వినియోగించింది. రానున్న రోజుల్లో దీన్ని కొనసాగించేందుకు 200 బిలియన్ డాలర్లకుపైగా నిధులివ్వాలని అమెరికా కాంగ్రెస్ను పెంటగాన్ కోరినట్లు తెలిసింది.

అమెరికాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లోని ఫోర్ట్ మెక్నాయర్ అనే సైనిక స్థావరంపై గుర్తుతెలియని డ్రోన్లను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక్కడే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నివాసాలు ఉండటం తీవ్ర కలవరపాటుకు గురి చేసింది.

మంటల్లో చమురు క్షేత్రాలు

సౌదీ అరేబియాలోని యాంబుకు సమీపంలో ఎర్ర సముద్రంలో ఉన్న శామ్ఫ్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో అది భారీగా ధ్వంసమైంది. ప్రపంచానికి సింహభాగం ఎల్ఎన్టీ అందించే ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంపై క్షిపణితో ఇరాన్ దాడి జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. దాడితో భారీగా నష్టం జరిగిందని ఖతార్ ఎనర్జీ ప్రకటించింది. నష్టాన్ని అంచనా వేస్తున్నామని షెల్ కంపెనీ వెల్లడించింది. ఈ కేంద్రంలో ఇప్పటికే ఉత్పత్తి నిలిచిపోయింది. విధ్వంసం కారణంగా యుద్ధం ఆగిపోయినా ఇప్పటికిప్పుడు గ్యాస్ను సరఫరా చేయలేమని ఖతార్ ఎనర్జీ తెలిపింది. ఈ క్షేత్రంలో 17శాతం గ్యాస్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని, పునరుద్ధరణకు ఐదేళ్లు పడుతుందని సంస్థ వెల్లడించింది.

Tags: The Gulf Trembles… Iran Launches Fierce Attacks on Oil Refineries, Including Qatar’s Key Ras Laffan Gas Field.