May 23, 2026
Explore
ఖాకీల మనసుకు ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ప్రశాంతత!

ఖాకీల మనసుకు ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ప్రశాంతత!

May 23, 2026 | Uncategorized

ఒత్తిడికి ‘ధ్యాన’ విరుగుడు!

ఘనంగా ముగిసిన మెడిటేషన్ క్యాంప్!

మదనపల్లి ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వులతో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మూడు రోజుల ‘హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్’ క్యాంప్ శనివారంతో ఘనంగా ముగిసింది. చివరి రోజైన శనివారం జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యంత ఉత్సాహంగా ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ (ఏఆర్) డి. ఏడుకొండల రెడ్డి ఆధ్వర్యంలో, రాయచోటి పోలీస్ పరేడ్ మైదానంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ నేతృత్వంలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే పీలేరులో సీఐలు యుగంధర్, అనిల్ కుమార్, పుంగనూరులో సీఐలు సుబ్బరాయుడు, సాయిప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. హార్ట్‌ఫుల్ నెస్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు డాక్టర్ గోపాల్, రామాంజనేయులు, డాక్టర్ అజమ్ తుల్లా ఖాన్, ట్రైనర్లు బయ్యారెడ్డి, రామలింగ రెడ్డి, సునీత, పద్మావతిల సమక్షంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు.

పోలీస్ సిబ్బందిలో నిరంతరం ఉండే వృత్తిపరమైన ఒత్తిడిని దూరం చేసి, వారిలో మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే ధ్యేయంగా ఈ మూడు రోజుల ప్రత్యేక ధ్యాన తరగతులను నిర్వహించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడుతూ.. అహర్నిశలు ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో తమకు కుదిరిన సమయంలో యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. వీటి ద్వారా మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చని, తద్వారా గుండె సంబంధిత రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా విధులను నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ మూడు రోజుల పాటు సిబ్బందికి ఎంతో ఓపికగా హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో శిక్షణ ఇచ్చిన సంస్థ ప్రతినిధులను, గురువులను జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని స్థానిక ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: ‘Heartfulness’ Brings Serenity to the Minds of the Khakis!