May 20, 2026
Explore
ప్రజలను హడలేస్తున్న …వైరస్ లు…ఎన్నో మరణాలు…

ప్రజలను హడలేస్తున్న …వైరస్ లు…ఎన్నో మరణాలు…

May 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మానవ జాతి కి పెను ముప్పు…హంటా వైరస్‌ నుంచి ఎబోలా వరకు.. ఎందుకు అంటువ్యాధులు మళ్లీ ప్రబలుతున్నాయి?

పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినడమే కారణం

జంతువుల నుంచే కొత్త రోగాలు

అడవుల నరికివేత వల్ల జనావాసాల్లోకి వ్యాధి కారకాలు

అంతర్జాతీయ ప్రయాణాలతో వేగంగా వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా 2026లో పాత వైరస్‌లు మళ్లీ ముంచుకొస్తున్నాయి. ఆఫ్రికాలో ఎబోలా, ఓ లగ్జరీ నౌకలో హంటావైరస్ కలకలం రేపగా బంగ్లాదేశ్‌లో తట్టు (మీజిల్స్‌) వేగంగా విజృంభిస్తోంది. అసలు ఈ అంటువ్యాధులు ఇప్పుడు ఎందుకు మళ్లీ ప్రబలుతున్నాయో నిపుణుల మాటల్లో చూద్దాం.

మారిన పర్యావరణం
ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. భూతాపం పెరగడం, అకాల వర్షాలు, వరదలు, అడవుల నరికివేత వల్ల మనుషులుండే ప్రాంతాలకు జంతువులు వస్తున్నాయి. ఎలుకలు, గబ్బిలాలు లాంటివి జనావాసాల్లోకి రావడం వల్ల వాటిలోని వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి.

అడవులు నరకడమే శాపం
పట్టణాల విస్తరణ, వ్యవసాయం కోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దీంతో అడవి జంతువులు వాటి సహజ సిద్ధమైన నివాసాలను కోల్పోతున్నాయి. ఇప్పటివరకు మనుషులకు పరిచయం లేని కొత్త రకం వైరస్‌లు అడవుల నుంచి బయటకు వస్తున్నాయి. గబ్బిలాలు, ఎలుకలు నేరుగా మనుషులతో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతోంది.

వాతావరణ మార్పుల ప్రభావం
తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల జంతువుల ప్రవర్తన మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరిగి కీటకాలు, వ్యాధి కారకాలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షపాతం మారడం వల్ల ఎలుకలు, గబ్బిలాల జనాభా అకస్మాత్తుగా పెరిగిపోతోంది. ఆహారం, నీరు వంటి వాటి కోసం ఇవి పొలాలు, ఇళ్లపై పడుతున్నాయి.

మెరుగైన నిఘా వ్యవస్థ
పూర్వం కంటే ఇప్పుడు రోగాలను గుర్తించే సాంకేతికత బాగా పెరిగింది. కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ల్యాబ్‌ల సామర్థ్యం పెరిగింది. దీంతో చిన్న వైరస్‌లను కూడా శాస్త్రవేత్తలు వెంటనే గుర్తిస్తున్నారు. గతంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వచ్చే జబ్బుల గురించి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు డిజిటల్ మానిటరింగ్ వల్ల వెంటనే అప్రమత్తం చేస్తున్నారు.

ప్రయాణాల వేగం
ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చాలా సులువుగా మారిపోయాయి. ఒక దేశంలో పుట్టిన వైరస్ విమానాలు, ఓడల ద్వారా కొన్ని గంటల్లోనే వేరే దేశానికి చేరుకుంటోంది. ఇటీవల క్రూజ్ షిప్‌లో వచ్చిన హంటావైరస్ దీనికి ఒక ఉదాహరణ. వివిధ దేశాల ప్రయాణికుల వల్ల ఇది వేగంగా సరిహద్దులు దాటుతోంది.

జాగ్రత్తలు
ఈ వైరస్‌ల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఎబోలా, హంటా లాంటి వైరస్‌లు సాధారణ జలుబు, దగ్గులాగా గాల్లో అంత వేగంగా వ్యాపించవు. కాబట్టి పరిశుభ్రంగా ఉండడం, అడవులను రక్షించడం, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారా వీటిని అడ్డుకోవచ్చు.

Tags: Viruses Terrifying the Public… Countless Deaths…