మున్సిపల్ సిబ్బంది వర్సెస్ ఇంటి యజమాని మధ్య ఘర్షణ
జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత
జేసీబీ కింద పడుకుంటామని బాధితుల ఆవేదనతో పోలీసుల జోక్యం
నీరుగట్టువారిపల్లె ముచ్చట్లు:
నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో రిజిస్టర్డ్ స్థలంలో కట్టుకున్న ఇంటికి ప్రహరీ గోడ అక్రమమంటూ శనివారం ఉదయం సచివాలయ సిబ్బంది జేసీబీతో కూల్చివేతకు యత్నించారు. దీంతో ఇంటి యజమాని వాసుదేవ, సచివాలయ సిబ్బంది మధ్య వాగ్వివాదం తలెత్తి ఘర్షణ వాతావరణం నెలకొంది. జన్మభూమి కాలనీకి చెందిన వాసుదేవ తన ఇంటి చుట్టూ పాములు, తేళ్లు రాకుండా ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. అయితే ఆ గోడ హైటెన్షన్ విద్యుత్ లైన్ కింద అక్రమంగా నిర్మించారని, మున్సిపల్ కమిషనర్ ప్రమీల కూల్చివేతకు ఆర్డర్ పాస్ చేశారని సచివాలయ సిబ్బంది జేసీబీతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది 1996లో రిజిస్టర్ చేసుకున్న పక్కా సెటిల్మెంట్ ల్యాండ్.
మా పత్రాలన్నీ ఉన్నాయి. ఇల్లు, స్థలం మాదే. పాములు వస్తున్నాయని ప్రహరీ వేసుకున్నాం. పార్టీ రంగు పులిమి తమ భూమిని కబ్జా చేయడానికి కుట్ర పన్నారు. ఉద్దేశపూర్వకంగానే మున్సిపల్ కమిషనర్ ఆర్డర్ పాస్ చేసి దౌర్జన్యం చేస్తున్నారు. అని యజమాని వాసుదేవ ఆవేదన వ్యక్తం చేశారు. గోడను కూలిస్తే జేసీబీ కింద పడుకుని చని పోవడానికైనా వెనుకాడబోం అని బాధితుడు వాసుదేవ కుటుంబం తేల్చి చెప్పింది. గొడవ సమాచారం అందుకున్న రెండో పట్టణ ఎస్‌ఐ నాగేశ్వర్ రావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్థలాన్ని సర్వే చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటా మని పోలీసులు తెలిపారు.
Tags: Attempt to Demolish Structure in Neerugattupalle, Citing It as an Illegal Construction