May 15, 2026
Explore
గోమాతల పరిరక్షణలో దాతల సహకారం ప్రశంసనీయం

గోమాతల పరిరక్షణలో దాతల సహకారం ప్రశంసనీయం

May 15, 2026 | Andhra Pradesh

: టిటిడి జేఈవో డా. ఎ. శరత్

తిరుపతి ముచ్చట్లు:

అకాల వర్షాల నుండి ఎండుగడ్డిని సంరక్షించాలి

టిటిడి ఎస్వీ గోశాలకు భక్తులు, దాతలు విరాళంగా అందించిన 180 లారీల ఎండుగడ్డిని అకాల వర్షాల నుండి రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలిసి ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన, గోవుల సంరక్షణ, ఎండుగడ్డి నిల్వలు, మౌలిక సదుపాయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా గోమాతల సేవలో భాగంగా ఎండుగడ్డి దానాన్ని అందించిన టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ టి. సత్యనారాయణలను జేఈవో ప్రత్యేకంగా అభినందించారు.

గోసంరక్షణ మహోన్నతమైన ధార్మిక సేవ అని పేర్కొంటూ, గోవుల పరిరక్షణకు మరింత మంది దాతలు ముందుకు వస్తే టిటిడి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

గోశాలకు దానంగా వచ్చిన ఎండుగడ్డిని శాస్త్రీయ విధానంలో విభజించి నిల్వ చేయాలని, వర్షాల ప్రభావం లేకుండా టార్పాలిన్ కవర్లతో భద్రపరచాలని అధికారులకు సూచించారు. గోవులకు ఎటువంటి ఆహార కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

“సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”పరిశీలన

టిటిడి ఆధ్వర్యంలో స్వదేశీ ఆవుల జన్యు పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్మాణంలో ఉన్న “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్”లో పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జేఈవో సూచించారు.

సెంటర్ పూర్తయిన అనంతరం పాలు ఇచ్చే ఆవుల సంఖ్య, భవిష్యత్తులో అవసరమయ్యే పాల ఉత్పత్తి సామర్థ్యం, పాలు సేకరణ, నెయ్యి తయారీ, పెరుగు–మజ్జిగ పంపిణీ, మానవ వనరుల వినియోగం తదితర అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తయితే ప్రతి షెడ్లో 250 ఆవుల సామర్థ్యంతో గోవులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. అలాగే గోవుల మేటర్నిటీ షెడ్, ఆధునిక మిల్కింగ్ పార్లర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, డిఈ దామోదర్, మేనేజర్లు మృదుల, గౌరీ, అసిస్టెంట్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Tags: The cooperation of donors in the protection of cows is praiseworthy.