అనకాపల్లి జిల్లాలో ‘పిట్ ఎన్.డి.పి.ఎస్’ (PIT NDPS) చట్టం అమలు
అనకాపల్లి ముచ్చట్లు:
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న నేరస్థులపై అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, నిరంతరం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక గంజాయి స్మగ్లర్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వుల మేరకు PIT NDPS ACT ను ప్రయోగించి జైలుకు తరలించడం జరిగింది.
నేరస్థుని వివరాలు:
రోలుగుంట మండలం, బెన్నభూపాలపట్నం గ్రామానికి చెందిన చిన్నీ కృష్ణ (35), తండ్రి గంగరాజు, గత కొంతకాలంగా వరుసగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడుతున్నాడు. ఇతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదుకు పైగా కేసులు నమోదై ఉన్నాయి:
రోలుగుంట పి.ఎస్ – క్రైమ్ నం: 57/2012, 57/2023, 42/2010.
నర్సీపట్నం ఎక్సైజ్ పి.ఎస్ – క్రైమ్ నం: 463/2009-10, 511/2010-11.
PIT NDPS చట్టం కింద అరెస్ట్:
వరుస నేరాలకు పాల్పడుతూ సమాజానికి ముప్పుగా మారిన చిన్నీ కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిని పరిశీలించిన ప్రిన్సిపల్ సెక్రటరీ G.O.RT No. 712, తేదీ 11.05.2026 ద్వారా ఇతనిపై PIT NDPS ACT (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act) అమలు చేయాలని ఆదేశించారు.
ఈ ఆదేశాల మేరకు కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, రోలుగుంట ఎస్సై పి.రామకృష్ణారావు మరియు సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ చట్టం కింద అరెస్టయిన వ్యక్తికి ఏడాది వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు.
ఎస్పీ హెచ్చరిక:
”జిల్లాలో గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలకు పాల్పడే వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సాధారణ సెక్షన్లతో పాటు అవసరమైతే పిడి యాక్ట్ (PD Act), పిట్ ఎన్.డి.పి.ఎస్ (PIT NDPS) వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తాము. ప్రజలు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి” అని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా హెచ్చరించారు.
Tags: Cracking Down on Ganja Smugglers