May 14, 2026
Explore
మే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు

మే 28 నుండి జూన్ 5 వరకు నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు

May 14, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

ఆకాశరాజు నిర్మించిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ మహోత్సాహం

మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం – మే 27న అంకురార్పణం

జూన్ 4న కల్యాణోత్సవం –
జూన్ 5న చక్రస్నానంతో ముగింపు

శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య క్షేత్రమైన నారాయణవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మే 27న సాంప్రదాయబద్ధంగా అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడనున్నారు.

ఆకాశరాజు నిర్మించిన పుణ్యక్షేత్రం

శ్రీ పద్మావతీ దేవి అవతరించిన పవిత్ర స్థలంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. శ్రీ ఆకాశరాజు పుత్రకామేష్టి యాగ సమయంలో స్వర్ణహలంతో భూమిని దున్నుతుండగా పద్మంపై వెలసిన దివ్య శిశువును కనుగొని “పద్మావతి” అని నామకరణం చేశారు. అనంతరం శ్రీనివాసుడు వేటకు విచ్చేసిన సందర్భంలో పద్మావతీదేవిని దర్శించి, ఆకాశరాజు అనుమతితో సకల దేవతల సమక్షంలో వివాహం జరిగింది. ఆ దివ్య కల్యాణ ఘట్టానికి చిరస్మరణగా ఆకాశరాజు నారాయణవనంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

స్వామివారి వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉండగా, ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవార్ల సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే శ్రీ కోదండరామస్వామి, శ్రీ రంగనాథస్వామి, శ్రీ రాజమన్నార్‌స్వామి ఉపాలయాలు ఈ క్షేత్ర మహిమను మరింత పెంచుతున్నాయి.

మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయంలో మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర ద్రావణాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు.

బ్రహ్మోత్సవాల వాహనసేవలు
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలపై స్వామి, అమ్మవారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.

మే 28 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
మే 29 – చిన్నశేష వాహనం, హంస వాహనం
మే 30 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
మే 31 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
జూన్ 1 – మోహినీ అవతారం, గరుడ వాహనం
జూన్ 2 – హనుమంత వాహనం, గజ వాహనం
జూన్ 3 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
జూన్ 4 – రథోత్సవం, అశ్వవాహనం, కల్యాణోత్సవం
జూన్ 5 – చక్రస్నానం, ధ్వజావరోహణం
జూన్ 4న స్వామివారి కల్యాణోత్సవం

జూన్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. రూ.1000/- టికెట్‌తో గృహస్తులు పాల్గొనవచ్చు. పాల్గొనే దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమను ప్రసాదంగా అందజేయనున్నారు.

ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, హరికథ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరింది.

Tags: Brahmotsavams in Narayanavanam from May 28 to June 5.