May 13, 2026
Explore
వైభవంగా రిషికేష్‌ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

వైభవంగా రిషికేష్‌ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

May 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

మే 15న వైభవోపేతంగా కల్యాణోత్సవం

హిమాలయ పర్వత శ్రేణుల నడుమ పవిత్ర గంగాతీరాన వెలసిన రిషికేష్‌ ఆంధ్రాశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మే 12న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మే 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఇందులో భాగంగా మే 15న జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 13న ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మికానందాన్ని పంచారు. మే 14న ఉదయం శేషవాహనం, రాత్రి గజవాహన సేవలు నిర్వహించనున్నారు.

మే 15న ఉదయం సింహవాహన సేవ అనంతరం రాత్రి శ్రీ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం వృషభవాహన సేవ నిర్వహిస్తారు. మే 16న ఉదయం త్రిశూలస్నానం, తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ధ్వజావరోహణం, రావణాసుర వాహన సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

మే 15న కల్యాణోత్సవం

బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం మే 15న సాయంత్రం 4.30 గంటలకు జరుగనుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.501/- టికెట్‌ కొనుగోలు చేసి ఈ దివ్యోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తూ భక్తులను అలరిస్తున్నారు.

Tags: Rishikesh Sri Chandramouleeswara Swamy’s Annual Brahmotsavams Celebrated with Grandeur