May 13, 2026
Explore
శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు

శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు

May 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు జూలై 31లోపు పూర్తి చేయాలి : టిటిడి జేఈవో డా. ఎ. శరత్

తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు ఈ ఏడాది జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. టిటిడి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రణాళికాబద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఏర్పాటు చేయనున్న విభాగాలు, గదులు, వైద్య సదుపాయాలు, మౌళిక వసతులు తదితర అంశాలను స్పష్టంగా ప్రతిబింబించేలా నివేదిక సిద్ధం చేయాలన్నారు.

అదేవిధంగా ప్రతి ఫ్లోర్‌లోని గదుల వారీగా ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్, వైద్య పరికరాలు, వైద్యులు మరియు రోగుల అవసరాలకు అనుగుణంగా కల్పిస్తున్న సౌకర్యాలను లే అవుట్ ప్రణాళికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం రెండో అంతస్తులో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన, ప్రతి గదిలో రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో జరుగుతున్న పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

తదుపరి శాఖల వారీగా కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జేఈవో, ఇంజనీరింగ్ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి, ఎస్.ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, ఈఈ సుమతి, డిప్యూటీ ఈఈ హర్షవర్థన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags: Construction Works for the New Building of Sri Padmavathi Children’s Hospital