May 12, 2026
Explore
దోపిడీ దొంగలపై జీఆర్పీ పోలీసుల కాల్పులు

దోపిడీ దొంగలపై జీఆర్పీ పోలీసుల కాల్పులు

May 12, 2026 | Andhra Pradesh

పొన్నూరు ముచ్చట్లు:

దోపిడీ దొంగల ముఠాపై జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. వారి చేతిలో వైర్లు కత్తిరించే సామగ్రి ఉండటంతో పోలీసులు పట్టుకోవటానికి యత్నించారు. వెంటనే దుండగులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు.. దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

సిగ్నల్ టాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలో ఇటీవల జరుగుతున్నాయి. దీంతో జీఆర్పీ పోలీసులు రాత్రి పూట తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరసరావుపేట రైల్వే పోలీస్ ఎస్సై తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తనిఖీ బృందంలో ఉన్నారు. పోలీసులు మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపినట్లు జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. అనుమానితులు సమీపంలోని పొలాల వైపు పరారైనట్టు చెప్పారు. ఘటన అనంతరం జీఆర్పీ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పొన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో అనుమానితులు వదిలివెళ్లిన వైర్ కట్టర్, టెస్టర్, జత గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:GRP Police Open Fire on Robbers