May 12, 2026
Explore
చిత్తూరులో గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత

చిత్తూరులో గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత

May 12, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు – చిత్తూరు డీఎస్పీ జె. వెంకటనారాయణ.

చిత్తూరు పట్టణంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొని జాతరను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చిత్తూరు డీఎస్పీ జె. వెంకటనారాయణ కోరారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని ఆయన తెలిపారు.

జాతరకు విచ్చేసే మహిళలు, చిన్నారులు, వృద్ధులు మరియు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు విస్తృత స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రత్యేకంగా జాతర ప్రాంతాల్లో మరియు ఓం శక్తి ఊరేగింపులో మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, ఈవ్-టీజింగ్, వేధింపులు, మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, గొలుసు చోరీలు, జేబుదొంగతనాలు వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

జాతర ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులు, షీ టీమ్స్, ప్రత్యేక పికెట్స్, డ్రోన్ కెమెరాలు మరియు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కెమెరాలను గాంధీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి 24 గంటల పాటు ప్రత్యేక పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, గొలుసు చోరీలు, జేబుదొంగతనాలు లేదా ఇతర నేరాలకు పాల్పడే వ్యక్తులను సంఘటన జరిగిన వెంటనే కాకపోయినా, సీసీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జాతరకు వచ్చే భక్తులు తమ బంగారు ఆభరణాలు, నగదు మరియు విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. చిన్నారులను ఒంటరిగా వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Tags:Tight Security for Gangamma Jatara in Chittoor