May 12, 2026
Explore
ఘోర రోడ్డు ప్రమాదం…ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం

ఘోర రోడ్డు ప్రమాదం…ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం

May 12, 2026 | Andhra Pradesh

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలో వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా, మరో లారీ బొగ్గు లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఢీకొన్న వెంటనే రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో లారీ డ్రైవర్లు ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. ప్రమాద తీవ్రత కారణంగా మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లకు స్వల్ప గాయాలు కాగా, వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రమాదం కారణంగా కొంతసేపు వరంగల్–ఖమ్మం రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags: Horrific Road Accident: Two Drivers Burnt Alive