- పుంగనూరులో విషాదం
పుంగనూరుముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణ కేంద్రంలో ద్విచక్రవాహనానికి చెందిన కార్భన్ మోనాక్సెడ్ వాయువులను పీల్చి నిద్రలోనే తాత, మనవడు, మనవరాళ్లు మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం ఉదయం పలువురిని కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన త్యాగరాజవీధిలో నాయిబ్రాహ్మణ కుటుంభానికి చెందిన మురళి ,ఆయన భార్య సెలూన్‌షాపు పెట్టుకుని జీవిస్తున్నారు. వీరికి నలుగురు పిల్లలు. కార్తీక్ (15), సుమబిందు(14), చందన(7) ,చరిత(7) లు ఉన్నారు. వీరితో పాటు మురళి తండ్రి రామచంద్ర కూడ పుంగనూరులో కుమారుడి వద్ద ఉన్నాడు. ఇలా ఉండగా మురళికి చెందిన సిటి100 ద్విచక్రవాహనం మరమ్మతులకు గురైంది. శనివారం మురళి తన వాహనాన్ని మెకానిక్ వద్దకు తీసుకెళ్లి మరమ్మతులు చేయించాడు. మెకానిక్ సూచనల మేరకు బోరు మరమ్మతులు చేసిన కారణంగా వాహనాన్ని రాత్రి పూర్తిగా స్టార్టింగ్‌లో పెట్టమని సలహా ఇచ్చాడు. మురళి రాత్రి తన వాహనాన్ని ఇంటికి తీసుకొచ్చి వాహనాన్ని లోపల పెట్టాడు. రాత్రి భోజనం చేసి మురళి, రేవతి దంపతులు మిద్దెపైన గల రూములో నిద్రకు ఉపక్రమించారు. తాత రామచంద్ర, మనవడు కార్తీక్ , కవల పిల్లలు చరిత, చందనలు తాత దగ్గర పడుకున్నారు. నిద్రించే సమయంలోనే విషవాయువులు పీల్చడంతో నలుగురు అచేతనంగా ఉండిపోయి నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మురళి, రేవతిలు లేచి చూడగా పరిస్థితిని గమనించి, కేకలువేయడంతో చుట్టు ప్రక్కల వారు చేరుకున్నారు. నలుగురు మృత్యుకౌగిలోకి చేరినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన పట్టణంలో దావనలంలా వ్యాపించింది. విషయం తెలియగానే సీఐ సుబ్బరాయుడు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డి లు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషాకు ఫోన్ చేసి సంఘటన స్థలానికి పంపారు. మృతుల కుటుంభాలను పరామర్శించి ఆదుకుంటామని హామి ఇచ్చారు.
Tags: Four Die After Inhaling Carbon Monoxide