April 22, 2026
Explore
అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’

అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘మెగా కౌన్సెలింగ్ – పరివర్తన సదస్సు’

April 22, 2026 | Andhra Pradesh

👉పాత నేరస్తులకు కలెక్టర్, ఎస్పీల దిశానిర్దేశం..

👉మహిళలను గౌరవిస్తామని నిందితుల ప్రతిజ్ఞ.

మదనపల్లి ముచ్చట్లు:

మహిళలపై నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి వచ్చిన వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘మెగా కౌన్సెలింగ్ – పోలీసు పరివర్తన సదస్సు’ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హాజరై పాత నేరస్తులకు దిశానిర్దేశం చేశారు.

కుటుంబాల కోసం మారాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ.. క్షణికావేశంలో లేదా వ్యసనాల బారిన పడి చేసే తప్పుల వల్ల నిందితుల కుటుంబాలు రోడ్డున పడతాయని కలెక్టర్ తెలిపారు. జైలు జీవితం నుండి పాఠాలు నేర్చుకుని, గతాన్ని వదిలేసి బాధ్యతాయుతమైన పౌరులుగా కొత్త జీవితం ప్రారంభించాలని ఆయన సూచించారు.

24×7 నిఘా ఉంటుంది.. మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ తప్పదు: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మాట్లాడుతూ.. మహిళల భద్రతకే పోలీసు శాఖ తొలి ప్రాధాన్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన వారి కదలికలపై, మరియు రౌడీ షీటర్ల పై, సచివాలయ పోలీసులు, శక్తి బృందాల ద్వారా 360⁰ డిగ్రీస్ మానిటరింగ్ చేస్తూ నిఘా ఉంచామన్నారు. మళ్లీ అదే నేర ప్రవృత్తి కనబరిస్తే ‘పీడీ యాక్ట్’ వంటి కఠిన చట్టాలు ప్రయోగిస్తామని గట్టిగా హెచ్చరించారు.

తగ్గిన నేరాలు.. పడిన శిక్షలు: అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి మాట్లాడుతూ.. పోలీసుల పటిష్ట చర్యలతో జిల్లాలో మహిళలపై నేరాలు గణనీయంగా (2023లో 636 కాగా, 2025లో 579కి) తగ్గాయన్నారు. 2023 నుండి ఇప్పటివరకు 19 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు, పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు పడేలా చేశామని వెల్లడించారు.

అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి. శంకర మల్లయ్య .. నిందితులందరి చేత “మహిళలను గౌరవంగా చూసుకుంటాం” అని ప్రతిజ్ఞ చేయించారు. తాము పూర్తిగా మారతామని, ఇతరులు ఎవరైనా తప్పు చేస్తుంటే తమ కఠిన జైలు జీవితం గురించి వివరించి వారిని మార్చే ప్రయత్నం చేస్తామని, పోలీసులకు సమాచారం ఇస్తామని నిందితులు హామీ ఇచ్చారు. మదనపల్లి డీఎస్పీ బి. పావని వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

Tags:’Mega Counseling – Transformation Session’ under the aegis of the Annamayya District Police