తిరుమల ముచ్చట్లు:
శ్రీ శృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామీజీ
ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటేగానీ వైదిక విద్యను అభ్యసించే అవకాశం కలగదని శృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి స్వామీజీ తెలియజేశారు. తిరుమలలోని ధర్మగిరి వద్ద ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ఆరు రోజుల పాటు నిర్వహించిన 29వ శ్రీవేంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో చివరిరోజైన శుక్రవారం సమాపనోత్సవానికి (విజయోత్సవానికి) విశిష్ట అతిథిగా ఆయన విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన వేద విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ ధర్మమే సమస్త ప్రపంచానికి ఆధారమని, వైదికమార్గం ద్వారానే ప్రపంచ శ్రేయస్సు లభిస్తుందని చెప్పారు. పరమ పవిత్రమైన తిరుమలక్షేత్రంలో ఉన్న వేద విజ్ఞాన పీఠం ప్రాచీన కాలం నుండి వేద, శాస్త్ర, ఆగమ విద్యలకు సంజీవనిగా నిలుస్తోందన్నారు.
వైదిక విద్య చాలా ఉత్కృష్టమైన విద్య అని, అన్ని ప్రమాణాల్లో వేదాలే సర్వ శ్రేష్టమైనవి అని తెలిపారు. వైదిక విద్యకు ఆచారం, సాంప్రదాయమే ముఖ్యమని చెప్పారు. వైదిక విద్యను అభ్యసించిన వారిని సమాజం మొత్తం గౌరవించాలని తెలియజేశారు.
అనంతరం ఆయన పరీక్షల్లో ఉత్తీర్ణులైన 313 మంది విద్యార్థులను సన్మానించి విజయ పత్రికలను ప్రదానం చేశారు.
కాగా వేద, శాస్త్ర, ఆగమాల్లోని 37 విభాగాల్లో దేశవ్యాప్తంగా 412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 313 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 202 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వగా, 111 మంది ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, ఇతర పండితులు పాల్గొన్నారు.
Tags: The opportunity to pursue Vedic studies is the fruit of meritorious deeds accumulated over many lifetimes.