అమరావతిముచ్చట్లు:
మహిళా బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలు భారత ప్రజాస్వామ్యంలో పెను మార్పులకు సంకేతం ఇస్తున్నాయి. ఏకాభిప్రాయం రాకపోతే పెను రాజకీయ మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉంది. గడిచిన దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేశాయి. తద్వారా ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విస్ఫోటనం కొనసాగింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు జరిగితే, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల బలం అమాంతం పెరుగుతుంది. అంటే, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత దక్కడం, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలహీనపడుతుంది.
సమాఖ్య స్ఫూర్తికి తూట్లు
రేవంత్ రెడ్డి నుంచి స్టాలిన్ వరకు దక్షిణాది నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో వాస్తవం ఉంది. పన్నుల రూపంలో కేంద్రానికి భారీ ఆదాయాన్ని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు, పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గితే అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారికి ఎక్కువ సీట్లు, బాధ్యతగా ఉన్నవారికి తక్కువ సీట్లు అనే ధోరణి కొనసాగితే, అది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇది కేవలం రాజకీయ అధికారం గురించిన పోరాటం మాత్రమే కాదు, ప్రాంతీయ ఆత్మగౌరవం , నిధుల కేటాయింపులో వాటాకు సంబంధించిన జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు.
ఏకపక్ష వివక్ష ప్రమాదం
చరిత్రను గమనిస్తే, ఎక్కడైతే ఒక ప్రాంతం తమపై వివక్ష చూపబడుతోందని భావిస్తుందో, అక్కడ అసంతృప్తి జ్వాలలు మొదలవుతాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో మా పన్నులు – మా హక్కులు అనే నినాదం బలంగా వినిపిస్తోంది. కేంద్రం గనుక కేవలం జనాభా ఆధారంగానే సీట్లను పెంచితే, అది దక్షిణాదిలో తీవ్రమైన ప్రత్యేక అస్తిత్వ ఉద్యమాలకు దారి తీసే ప్రమాదం ఉంది. శ్రీలంక వంటి దేశాల్లో ఇలాంటి ప్రాతినిధ్య సమస్యలే అంతర్యుద్ధాలకు దారితీసిన విషయాన్ని మేధావులు గుర్తు చేస్తున్నారు.
బీజేపీకి అసలైన పరీక్ష
మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్ అవసరమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దాని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ దక్షిణాదిలో తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటే అది ఎదురుదెబ్బ కాగలదు. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కాకుండా, ఆర్థిక వృద్ధి, అక్షరాస్యత , జనాభా నియంత్రణలో సాధించిన విజయాలను కూడా పరిగణనలోకి తీసుకునే కొత్త ఫార్ములాను కేంద్రం అన్వేషించాల్సి ఉంది. ఓవరల్‌గా యాభై శాతం సీట్లను పెంచుతున్నారు.. కానీ రాష్ట్రాలకు ఎలా పెంచుతారో ఇంకా డిసైడ్ చేయలేదు. దాని కోసం విస్తృతంగా చర్చలు జరపాల్సిన అవసరం మాత్రం అనివార్యంగా కనిపిస్తోంది.
Tags: The Centre must heed the arguments of the Southern states!