April 12, 2026
Explore
ఆట.. వేట.. చివరకు కన్నీటి మూట!

ఆట.. వేట.. చివరకు కన్నీటి మూట!

April 12, 2026 | Andhra Pradesh

💠క్రికెట్ బెట్టింగ్ మాయాజాలంపై అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేక కథనం.

మదనపల్లి ముచ్చట్లు:

అది ఒక మధ్యతరగతి గడప. ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి. కానీ, అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కారణం.. ఆ ఇంటి ఆశల దీపం, ఒక యువకుడు ‘క్రికెట్ బెట్టింగ్’ అనే మాయలో పడి తన జీవితాన్ని, తన తల్లిదండ్రుల పరువును పందెంగా పెట్టాడు. మొన్నటిదాకా ఫోన్ లో సిక్సర్ కొడితే చిందులేసిన ఆ యువకుడు, ఈరోజు అప్పుల వాళ్ల భయంతో ఎక్కడికో పారిపోయాడు. ఇది ఎక్కడో ఒకచోట ప్రతిరోజూ వినిపిస్తున్న మూగ రోదన.

ఈ ఐపీఎల్ సీజన్ లో సరదా పేరుతో మొదలయ్యే ఈ ‘బెట్టింగ్’ వ్యసనం, చివరకు ఎలా ఒక మనిషిని నేరస్థుడిగా మారుస్తుందో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తూ కళ్లు తెరిపించే వాస్తవాలను వివరించారు.

గతంలో జూదం అంటే వీధి చివరన రహస్యంగా ఆడేవారు. కానీ ఇప్పుడు మీ బిడ్డ చేతిలో ఉన్న సెల్‌ఫోనే ఒక ప్రమాదకరమైన జూదశాలగా మారింది.

ఒక యాప్ డౌన్‌లోడ్ చేస్తారు. ఎవరో అపరిచితుడు పంపే లింక్ ద్వారా వందలు వేలు గెలుస్తారు. ఇదే బానిసను చేసే ‘గాలం’.

గెలిచిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడతారు. ఒక్కసారి ఓడిపోగానే, ఆ డబ్బును తిరిగి సంపాదించాలనే కసితో తల్లిదండ్రుల నగలు, ఆస్తులు తాకట్టు పెడతారు.

అప్పులు తీర్చలేక దొంగతనాలు, సైబర్ నేరాలు లేదా ఆత్మహత్యలకు పాల్పడతారు.

మీ అబ్బాయి ఫోన్ లో ఏమి చూస్తున్నాడు? మ్యాచ్ జరుగుతున్నప్పుడు విపరీతమైన టెన్షన్ పడుతున్నాడా? అకస్మాత్తుగా డబ్బుల కోసం అబద్ధాలు చెబుతున్నాడా? అయితే అతను ప్రమాదంలో ఉన్నట్టే! “మీ పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేముందు, అది వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతుందో లేక మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందో గమనించండి” అని ఎస్పీ హెచ్చరించారు.

“యువతా..! మేము కేవలం మైదానంలోనే కాదు.. మీ ఫోన్ లోని డేటాలో కూడా నిఘా ఉంచాం” అని ఎస్పీ స్పష్టం చేశారు.

జిల్లా సైబర్ క్రైమ్ విభాగం బెట్టింగ్ వెబ్‌సైట్లను, అక్రమ లావాదేవీలను నిరంతరం గమనిస్తోంది.

బెట్టింగ్ కేసులో చిక్కుకుంటే క్రిమినల్ రికార్డు నమోదవుతుంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రావు, విదేశాలకు వెళ్లే పాస్‌పోర్ట్ దొరకదు. చదువుకున్న చదువు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

బుకీల మీద, వాట్సాప్ గ్రూపుల మీద నిరంతరం నిఘా ఉంచాం. నేరం రుజువైతే జైలు శిక్ష తప్పదు.

యువతకు ఎస్పీ సూటి ప్రశ్న:
“ఒక్క నిమిషం ఆలోచించండి.. మీరు పందెం కాసే ప్రతి రూపాయి మీ తండ్రి చెమట చుక్క లేదా మీ తల్లి కళ్లలోని ఆశ. ఎవరో బుకీ మీ డబ్బుతో మేడలు కట్టుకుంటుంటే, మీరు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోవాలా? ఆటను ఆటలాగే చూడండి.. దాన్ని జీవితాన్ని చిన్నాభిన్నం చేసే జూదంగా మార్చకండి.” అని ఎస్పీ యువతకు సందేశం ఇచ్చారు.జిల్లా ప్రజలారా..! మీ వీధిలో లేదా గ్రామంలో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100/112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు రహస్యంగా ఉంచబడతాయి.

Tags: A game… a hunt… and ultimately, a bundle of tears!