April 11, 2026
Explore
హెచ్ఐవీ రాకున్నా.. సూటిపోటి మాటలు చంపాయి

హెచ్ఐవీ రాకున్నా.. సూటిపోటి మాటలు చంపాయి

April 11, 2026 | Andhra Pradesh

మార్చి 11న బలవంతంగా రక్తం ఎక్కించిన యువకుడు…

సోషల్‌ మీడియాలో ప్రచారం…తీవ్ర మనోవేదనకు గురైన యువతి

సూసైడ్‌ నోట్‌ రాసి, సెల్ఫీ వీడియో తీసుకొని బలవన్మరణం..

హైదరాబాద్ ముచ్చట్లు:

ఘట్కేసర్:ప్రేమించిన వ్యక్తితో కలిసి బతకాలనుకుంది. అతడికి హెచ్ఐవీ ఉన్నట్లు తెలియడంతో ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. భరించలేని అతడు కక్షగట్టి ప్రేమించిన అమ్మాయికి తన రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటనతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. హెచ్ఐవీ సోకనప్పటికీ సూటిపోటి మాటలతో కలత చెంది నెలరోజుల తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధిలో శుక్రవారం జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లాకు చెందిన మనోహర్(26) కుటుంబం పాతికేళ్ల క్రితం నగరానికి వచ్చి ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంటోంది. యువకుడు ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్. అతని తల్లిదండ్రులకు హెచ్ఐవీ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడు. అతను తమ ఇంటికి సమీపంలో ఉంటున్న మరదలు రమణి(24)ని ఇష్టపడ్డాడు. పెద్దలు సమ్మతించటంతో ప్రేమగా మెలిగారు.

వివాహానికి సిద్ధమయ్యే సమయంలో మనోహర్కు యువతి తండ్రి రక్తపరీక్షలు చేయించగా హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. దీంతో వివాహం రద్దు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి ప్రేమించిన యువతి.. దూరం కావటంతో భరించలేకపోయాడు. ఆమెకూ హెచ్ఐవీ పాజిటివ్ ఉంటే తనతోనే వివాహం చేస్తారని క్రూరంగా ఆలోచించాడు. మార్చి 11న సిరంజీ కొని తన రక్తాన్ని ఎక్కించాడు. తర్వాత యువతి ఇంటికి వెళ్లి ఆమెకు బలవంతంగా అదేరక్తం ఎక్కించి పారిపోయాడు. బాధితురాలు విషయం రహస్యంగా ఉంచింది. కొద్దిరోజుల తరువాత ఆమెకు జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినపుడు విషయం బయటపడింది. వైద్యపరీక్షలో యువతికి హెచ్ఐవీ సోకలేదని తేలింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గతనెల 14న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు జైలులో ఉన్నాడు.

మనోవేదనతో కుమిలిపోయి..

శుక్రవారం ఆమె నానమ్మ ఇంటికి వెళ్లి.. సెల్ఫీ వీడియోలో ‘మమ్మీ డాడీ..

నాకు బతకాలని లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి నా జీవితం నాశనం చేశారు. నేను చేయని తప్పుకు నన్ను బలిచేశారు. నా క్యారెక్టరే నా రెస్పెక్ట్‌.

నిజానిజాలు తెలుసుకోకుండా ఓ అమ్మాయిని సోషల్‌ మీడియాలో ఇలా ట్రోల్‌ చేయడం కరెక్ట్‌ కాదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ‘అమ్మా నాన్న నన్ను క్షమించండి. నాకు బతకాలని లేదు. మరో జన్మంటూ ఉంటే మీ కడుపునే పుడతాను.

చెల్లి, తమ్ముడు.. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి’ అని సూసైడ్‌ నోట్‌ రాసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. యువతిని ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags: Even though he didn’t contract HIV… the hurtful words killed him.