👉తమిళనాడు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి.
👉ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే మెరుగైన సేవలు అందించాలి.
🎯మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పరేడ్.. పాల్గొన్న కమాండెంట్ శ్రీ . యం. మహేష్ కుమార్ గారు..
మదనపల్లి ముచ్చట్లు:
పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాఖ ప్రతిష్టను పెంచేలా పని చేయాలని రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, శుక్రవారం మదనపల్లిలోని బి.టి. కళాశాల పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి హోంగార్డులకు ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమాండెంట్ పరేడ్ లో హోంగార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు.
ఎన్నికల విధులే పరమావధి:
త్వరలో తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికల విధులకు వెళ్లే హోంగార్డులకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. పరాయి రాష్ట్రంలో విధులు నిర్వహించేటప్పుడు అత్యంత ఓర్పుతో ఉండాలని, ఓటర్లతో మర్యాదగా ప్రవర్తిస్తూనే నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న మెళకువలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం:
సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని కమాండెంట్ స్పష్టం చేశారు. “మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి సమర్థవంతంగా సేవ చేయగలరు” అని పేర్కొన్నారు. అలాగే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహిస్తూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ వ్యక్తి గత ఇన్స్యూరెన్స్ లు కలిగి ఉండాలని సూచించారు.
సమస్యల పరిష్కారానికి ‘దర్బార్’:
అనంతరం నిర్వహించిన ‘దర్బార్’లో హోంగార్డులు తమ సమస్యలను కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యలను జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సబ్ డివిజన్ ఇంచార్జీలకు లేదా రిజర్వ్ ఇన్స్పెక్టర్‌కు తెలపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీ డి. ఏడుకొండల రెడ్డి, హోంగార్డ్స్ డీఎస్పీ కె.బి.వి. ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె. సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐలు ఏ. శ్రీనివాస్, జి.రవి, హోంగార్డ్స్ ఇంచార్జీలు మరియు పెద్ద సంఖ్యలో హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Uphold the Prestige of the Police Department: Regional Commandant Calls Upon Home Guards.