పట్టువలు సమర్పించనున్న ఎమ్మెల్యే, ఎంపి
- జాతరకు సర్వం సిద్ధం
- బంధుమిత్రులతో కోలాహలం
పుంగనూరుముచ్చట్లు:
పట్టణ జమీందారుల ఆరాధ్య కులదైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను మంగళ, బుధవారాలలో వైభవంగా ప్రారంభం కానున్నది. ఉదయం నుంచి జమీందారుల ప్యాలెస్‌లో అమ్మవారిని పెట్టి , ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి లు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జాతరను పటిష్టంగా నిర్వహించేందుకు సబ్ కలెక్టర్ కళ్యాణి, ఎస్పీ ధీరజ్‌కునుబిలి ల ఆధ్వర్యంలో కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, సీఐ సుబ్బరాయుడు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పట్టణానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. మంచినీరు, చలువ పందిళ్లు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలోని ముఖ్యమైన రహదారులు, కూడలి ప్రాంతాలలో హైమాక్స్లైట్లు ఏర్పాటు చేసి, ఇందు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
జాతర ఇలా….
శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఇలా జరగనున్నది. అమ్మవారిని తొలుత ప్యాలెస్‌లో ఉంచి జమీందారి కుటుంబీకులు సోమశేఖర్ చిక్కరాయల్, మల్లికార్జున చిక్కరాయల్ , వారి కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని మంగళవారం రాత్రి 8 గంటలకు ప్యాలెస్‌లో నుంచి తీసుకొచ్చి ప్రత్యేక వాహనంలో పట్టణంలో వేలాది మంది భక్తుల ప్రార్థనల మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు. ఊరేగింపు ప్యాలెస్ ఆవరణం, తేరువీధి, పోస్టాఫీసు వీధి, సుబేదారువీధి, తూర్పువెహోగసాల, కుమ్మరవీధి, కట్టక్రిందపాళెం మీదుగా ప్యాలెస్ ఆవరణంలోని బుధవారం వేకువజామున తీసుకొస్తారు. అక్కడ శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని ఉంచుతారు. అప్పుడు సాంప్రదాయం ప్రకారం బెస్తకులస్తులు, తోటికులస్తులు అమ్మవారికి పూజలు చేసి, సారే పెట్టడం ఆనవాయితీ. వారి పూజలు పూర్తి కాగానే జమీందారి కుటుంబీకులు జమీందారి సాంప్రదాయ దుస్తులు ధరించి తొలి పూజలు చేసిన తరువాత భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పిస్తారు. గురువారం వేకువజామున అమ్మవారిని నిమజ్జనం చేసి, అమ్మవారి విగ్రహాన్ని జమీందారులకు అప్పగించడం ఆనవాయితీ.

Tags: Sri Sugutur Gangamma Jatara for two days from 10