తిరుపతి ముచ్చట్లు:
శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం నవాహ్నిక వైభవం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 06 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.
ఉత్సవాలకు ముందు ముఖ్య కార్యక్రమాలు
డిసెంబర్ 01: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ శుద్ధి కోసం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
డిసెంబర్ 05: ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ.
వాహనసేవల వేళలు
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం రాత్రి
06.12.2026 (ఆదివారం) ధ్వజారోహణం చిన్నశేష వాహనం
07.12.2026 (సోమవారం) పెద్దశేష వాహనం హంస వాహనం
08.12.2026 (మంగళవారం) ముత్యపుపందిరి వాహనం సింహ వాహనం
09.12.2026 (బుధవారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
10.12.2026 (గురువారం) పల్లకీ ఉత్సవం గజ వాహనం
11.12.2026 (శుక్రవారం) సర్వభూపాల వాహనం స్వర్ణరథం, గరుడ వాహనం
12.12.2026 (శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
13.12.2026 (ఆదివారం) రథోత్సవం అశ్వ వాహనం
14.12.2026 (సోమవారం) పంచమీ తీర్థం ధ్వజావరోహణం
15.12.2026 (మంగళవారం) పుష్పయాగం –
ఆలయ నేపథ్యం: బంగారు పద్మంలో అవతరించిన అమ్మవారు
తిరుచానూరు ఆలయ స్థల పురాణం ప్రకారం, శ్రీ పద్మావతి అమ్మవారు పద్మసరోవర పుష్కరిణిలో బంగారు పద్మం నుండి ఆవిర్భవించినట్లు ప్రతీతి. అందుకే ఈ ప్రదేశానికి పద్మావతిపురం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే తిరుచానూరుగా మారింది. ఈ పవిత్ర పుష్కరిణి అమ్మవారి ఆలయం వెనుక భాగంలో ఉంది.
పద్మసరోవర విశిష్టత
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత, కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో, బంగారు వర్ణంతో అమ్మవారు బంగారు పద్మం నుండి ఉద్భవించారు. ఆ పవిత్ర దినానికి తొమ్మిది రోజుల ముందు నుంచే శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
పంచమీ తీర్థం: చక్రస్నాన పుణ్యఫలం
బ్రహ్మోత్సవాల చివరి రోజైన పంచమీ తీర్థం నాడు పద్మసరోవరంలో చక్రస్నానం జరుగుతుంది. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సప్త సముద్రాలు, ముక్కోటి తీర్థాల్లో స్నానమాచరించిన పుణ్యఫలం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని, చక్రస్నాన సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించి పునీతులవుతారు.
ఆర్జిత సేవల రద్దు
డిసెంబర్ 01: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం రద్దు.
డిసెంబర్ 05 నుండి 16 వరకు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనాలు రద్దు.
Tags: Annual Kartika Brahmotsavams of Sri Padmavathi Ammavaru to be held in Tiruchanur from December 6 to 14