అక్రిడిటేషన్ ఉన్నవారికి ఎక్కువ రక్షణ ఉండాలా?
పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు
దిల్లీ ముచ్చట్లు:
జర్నలిస్టుగా ఉండటానికి అర్హులెవరు, నిరసనలకు సంబంధించిన వార్తల కవరేజీ సమయంలో ప్రభుత్వ గుర్తింపు (అక్రిడిటేషన్) పొందిన మీడియా వ్యక్తులకు ‘స్వయంప్రకటిత విలేకరుల’ (సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ జర్నలిస్టులు) కంటే ఎక్కువ రక్షణ ఉండాలా అనేవి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. పాత్రికేయుల స్వేచ్ఛను, శాంతిభద్రతల నిర్వహణను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం గురువారం పేర్కొంది. అక్టోబరు 10, 11 తేదీల్లో దిల్లీలో నిరసన ప్రదర్శనల వార్తలు కవర్ చేయడానికి వెళ్లినవారిలో ఏడుగురు జర్నలిస్టులపై దౌర్జన్యం చేసి, నిర్బంధించిన విషయాన్ని పరిశీలించాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి అప్పగించింది.
‘‘పిటిషనర్లు తమవద్ద ఉన్న సమాచారాన్ని ఆ కమిటీకే అందజేయాలి. కేసులో పేర్కొన్న పాత్రికేయులు ఆ రోజు ఆ సమయంలో అక్కడే ఉన్నారా, వారిపై దౌర్జన్యం జరిగిందా, శాంతిభద్రతల నిర్వహణకు అవసరమైనదానికంటే ఎక్కువ స్థాయిలో వారిపై బలప్రయోగం చేశారా అనేది కమిటీ చూస్తుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. అక్రిడిటేటెడ్ పాత్రికేయులకు ఉన్నంత రక్షణ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ జర్నలిస్టులకు ఉండకపోవచ్చని జస్టిస్ బాగ్చీ చెప్పారు. నిరసనల వేదిక వద్ద నుంచి పాత్రికేయుల్ని బలవంతంగా తరలించారని, ఘటనల్ని రికార్డు చేయనివ్వకుండా అడ్డుకున్నారని కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, దిల్లీ జర్నలిస్టుల యూనియన్ తమ పిటిషన్లలో తెలిపాయి.
అక్రిడిటేషన్ కార్డుల్ని చూపిస్తున్నా పట్టించుకోకుండా ఈడ్చుకుపోయి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించాయి. పెద్ద మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ఏడుగురు పాత్రికేయులు దీనిలో ఉన్నారని, వారేమీ రీళ్లు చేసుకునేవారు కాదని సీనియర్ న్యాయవాది పి.వి.దినేశ్ తెలిపారు. గుర్తింపు పొందినవారిని ఇలా కస్టడీలోకి తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు, పాత్రికేయులకు మధ్య తేడా ఉండాల్సిందేనని దిల్లీ పోలీసులు ఇదివరకు ప్రమాణపత్రంలో పేర్కొన్నారు.
Tags: Who is qualified to be a journalist?