November 17, 2026
Explore
శ్రీహరికోట షార్‌లో 400 అప్రెంటిస్ పోస్టులు!

శ్రీహరికోట షార్‌లో 400 అప్రెంటిస్ పోస్టులు!

November 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రభుత్వ రంగ సంస్థలో శిక్షణ ద్వారా కెరీర్ ప్రారంభించాలనుకునే నిరుద్యోగ యువతకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR), వివిధ విభాగాల్లో 400 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-50, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-60, టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా)-35, డిప్లొమా (డీసీసీపీ)-60, ట్రేడ్ అప్రెంటిస్-180, ఒకేషనల్ అప్రెంటిస్-15 పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ, బీఈ/బీటెక్ వంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 26వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అకడమిక్ మెరిట్ ఆధారంగా ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో పోస్టును బట్టి నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.10,900, ట్రేడ్, ఒకేషనల్ అప్రెంటిస్‌లకు రూ.9,600 చొప్పున అందిస్తారు. పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్థులు SDSC SHAR అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Tags: 400 apprentice posts at SHAR, Sriharikota!