November 17, 2026
Explore
అవినీతి కోరల్లో కూరుకుపోయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అధికారిని

అవినీతి కోరల్లో కూరుకుపోయిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అధికారిని

November 17, 2026 | Andhra Pradesh

మొయినాబాద్ ముచ్చట్లు:

తన సర్వీస్ లో జీతం 70లక్షలు డ్రా చేస్తే…..అవినీతి సొమ్ము అక్షరాల 30కోట్లు కూడబెట్టింది… ఎందరి పేద వారి రక్తం సొమ్మొ ఏమో కానీ.. చివరికి ఏసీబీ సోదాల్లో చిక్కింది….!ఉన్న పరువు, ఉద్యోగం రెండు పోయా…ఇక పబ్లిక్ లో గౌరవము ఎక్కడ!..కష్టపడి రాత్రి, పగలు చదివి సంపాదించిన గవర్నమెంట్ జాబ్ హుందా గా ఉండాలి..అంతేకానీ అవినీతి లో కూరక పోకూడదు

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి అక్రమాస్తుల గుట్టురట్టు

కూతురి రియల్ ఎస్టేట్ సంస్థలోకి లంచాల మళ్లింపు

వైన్స్, షేర్లలో రూ. 1.80 కోట్ల పెట్టుబడులు

రూ. 5.47 లక్షల నగదు, బంగారం, కార్లు సీజ్

ఏసీబీ సోదాల్లో బయటపడ్డ రూ.30 కోట్ల అక్రమాస్తులు

పదేళ్ల సర్వీసులో వచ్చిన అధికారిక జీతం కేవలం రూ. 70 లక్షలు మాత్రమే. కానీ ఆమె వెనకేసిన అక్రమాస్తుల బహిరంగ మార్కెట్ విలువ మాత్రం ఏకంగా రూ. 30 కోట్లు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారిణి (టీపీఓ) గుండు వాణి అవినీతి బాగోతాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెలుగులోకి తెచ్చింది.

జీ+3 భవన నిర్మాణ అనుమతుల మంజూరు కోసం మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఖమర్ నుంచి రూ. 75 వేలు లంచం తీసుకుంటూ సెప్టెంబర్ 30న మాజీ పంచాయతీ కార్యదర్శి ఎలమోని సుదర్శన్‌తో కలిసి ఆమె ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైలు రిమాండ్‌లో ఉన్న ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు, నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించారు.

హైదరాబాద్ ఆసిఫ్ నగర్‌కు చెందిన గుండు వాణి 2016లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం సూపర్‌వైజర్, టీపీఓగా పదోన్నతులు పొందారు. వికారాబాద్ మున్సిపాలిటీతో పాటు మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి మున్సిపాలిటీల అదనపు బాధ్యతలు నిర్వహించిన సమయంలో భవనాల విస్తీర్ణం, ఫ్లోర్ల సంఖ్యను బట్టి భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పదేళ్లలో ఆమె సంపాదించిన అధికారిక వేతనం రూ.70 లక్షలు కాగా, ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 6.76 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను కూడబెట్టారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.30 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు తేల్చారు.

లంచాల రూపంలో వచ్చిన అక్రమ సొమ్మును కూతురి పేరిట నెలకొల్పిన రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా ఆమె భర్త వ్యాపారంలోకి మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అత్తాపూర్, జడ్చర్ల, జనగామ సహా ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అత్తాపూర్‌లో రూ. 63 లక్షల ఫ్లాట్, రూ. 2.45 కోట్ల విలువైన జీ+2 భవనం, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో 1.10 ఎకరాల వ్యవసాయ భూమి, జడ్చర్ల, పాలకుర్తిలలో ఓపెన్ ప్లాట్లను గుర్తించారు.

వీటితో పాటు మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవానీ వైన్స్‌లో రూ. 50 లక్షలు, షేర్ మార్కెట్‌లో రూ.1.30 కోట్ల పెట్టుబడులు ఉన్నట్లు తేలింది. రూ. 5.47 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ. 7.97 లక్షల డిపాజిట్లు, 175 గ్రాముల బంగారం, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, హ్యుందాయ్ క్రెటా కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను అధికారులు సీజ్ చేశారు.

Tags: A Town Planning Officer ensnared in the clutches of corruption