అమరావతిముచ్చట్లు:
పంచాయతీ, మున్సిపాలిటీల్లోనూ కూటమిదే విజయం కావాలి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే జోరు
కొనసాగాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి పంచాయతీలో కూటమి అభ్యర్థులే గెలిచి తీరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మించి స్థానిక ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగాలని, గెలుస్తామన్న ధీమాతో ఉదాసీనంగా ఉండకుండా అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి పర్యటించాలని దిశానిర్దేశం చేశారు.
అన్ని వర్గాలకూ సమన్యాయం: సోషల్ రీ-ఇంజనీరింగ్
ఈ ఎన్నికల టికెట్ల కేటాయింపులో సంపూర్ణంగా ‘సోషల్ రీ-ఇంజనీరింగ్’ విధానాన్ని అమలు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న 11 నగర పాలక సంస్థల (కార్పొరేషన్) మేయర్ స్థానాలను 11 విభిన్న సామాజిక వర్గాలకు కేటాయించి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను ప్రాతిపదికగా తీసుకునే అభ్యర్థుల ఎంపిక చేపట్టామని చెప్పారు. అంతర్గత సర్వేల్లో 50 శాతానికి పైగా ప్రజా మద్దతు ఉన్న వారికే ప్రాధాన్యమిచ్చామని, పలువురు అభ్యర్థులకు 80 శాతానికి పైగా ఆమోదం లభించిందని తెలిపారు.
ఐక్యతే మన బలం.. మిత్రధర్మం పాటించండి
కూటమిలోని పార్టీల మనోభావాలను పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒకవైపు పార్టీ బలోపేతం, మరోవైపు కూటమి బంధం పటిష్టం కావడం ఈ రెండూ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఒకట్రెండు చోట్ల స్థానికంగా తలెత్తిన చిన్నపాటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. సీట్లు ఆశించి దక్కించుకోలేకపోయిన వారికి వాస్తవ పరిస్థితులను వివరించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకత్వం ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే కుట్రలను తిప్పికొట్టాలి
ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విపక్ష ‘గొడ్డలి పార్టీ’ వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీ అరాచక చర్యలు, ఎత్తుగడలపై నిరంతరం కన్నేసి ఉంచాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. కూటమిలోని అన్ని పక్షాలు కలిసికట్టుగా శ్రమించి అఖండ విజయాన్ని సాధించాలని పునరుద్ఘాటించారు.
Tags: We must win every local body.