తిరుమల ముచ్చట్లు:
టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ మరుగుదొడ్ల పరిశుభ్రతలో రాజీ లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ తెలిపారు. తిరుమలలోని రామ్ భగీచా-2 లోని మీడియా సెంటర్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో 45 మరుగుదొడ్లలో 3 షిఫ్టుల్లో సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. తిరుమలలో శాశ్వతంగా 230 మరుగుదొడ్లు, 149 తాత్కలిక మరుగుదొడ్లు ఉన్నాయని, రోజుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఈ మరుగుదొడ్లను వినియోగిస్తారని తెలిపారు. అయినప్పటికీ మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ను పాటిస్తూ అనునిత్యం శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు.
అదేవిధంగా వాహన సేవల సమయంలో మాడ వీధుల్లో పేరుకునే చెత్తను ఎప్పటికప్పుడు టిప్పర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తిరుమలలో 2600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారని, బ్రహ్మోత్సవాల సందర్భంగా అదనంగా అదనంగా 750 మంది సిబ్బంది తమ సేవలు అందిస్తున్నారని చెప్పారు.
శ్రీవారి సేవకుల ద్వారా మరుగుదొడ్ల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరించి, వారి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని మరింత పరిశుభ్రత పాటించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
తిరుమలలో ఆహార భద్రతకు పెద్ద పీట వేస్తూ రోజుకు ఆహారం, తాగునీటిని 50 శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మంగళవారం తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మాస క్లీనింగ్ డే ను అమలు చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ పాల్గొన్నారు.
Tags: Sanitation is a big focus during the Brahmotsavam of Srivari Navratri.