తిరుమల ముచ్చట్లు:
టీటీడీ రవాణా విభాగం జీఎం శ్రీ రాము
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులతో (శ్రీవారి ధర్మ రథాలు) పెద్ద ఎత్తున కాలుష్యాన్ని అరికడుతున్నట్లు టీటీడీ రవాణా విభాగం జీఎం శ్రీ రాము తెలిపారు. తిరుమలలోని రామ్ భగీచా-2 లోని మీడియా సెంటర్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం తిరుమలలో 38 ఎలక్ట్రిక్ బస్సులు రెండు రూట్లలో భక్తులకు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ప్రతి 3 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు ఉచిత రవాణా సదుపాయాన్ని విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. గతంలో రోజుకు 300 ట్రిప్పుల ద్వారా 35 వేల మంది భక్తులు ప్రయాణించేవారనీ, ప్రస్తుతం 850 ట్రిప్పులకు పెంచడంతో ఉచిత బస్సుల్లో ప్రయాణించే భక్తుల సంఖ్య దాదాపు 80వేలకు చేరిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 20 బస్సులను అదనంగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని తద్వారా మరింతమంది భక్తులు ఉచిత బస్సుల్లో సౌకర్యవంతంగా ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
బస్ స్టాపుల్లో డిజిటల్ డిస్ల్పే బోర్డుల ద్వారా బస్సుల సమాచారం ముందస్తుగా అందిస్తుండటంతో భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పారు. డీజిల్ బస్సు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావడంతో కర్బన ఉద్గారాలు విశేష స్థాయిలో తగ్గడంతో పెద్ద ఎత్తున కాలుష్యాన్ని నియంత్రించడం జరుగుతోందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో కుమారి నీలిమ పాల్గొన్నారు.
Tags:Significant pollution control in Tirumala through electric buses.