- 48 గంటల్లోనే రు. 3 లక్షల వరకు రుణం
- 3 లక్షల లోపు ఉన్న PMFME సబ్సిడీ లోన్స్ ఇప్పుడు స్త్రీ నిధి ద్వారా మంజూరు
- మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
- 11 % వడ్డీకే రూ.3 లక్షల స్త్రీనిధి రుణాలు
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయవాడ ముచ్చట్లు:
ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ‘స్త్రీనిధి ఆంధ్రప్రదేశ్’ ద్వారా ప్రత్యేక మహిళా పారిశ్రామికవేత్తల రుణ పథకాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి స్వయం సహాయక సంఘం (SHG) మహిళకు రూ.3 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని.. ఒక్కో స్వయం సహాయక సంఘం నుంచి గరిష్టంగా ముగ్గురి చొప్పున అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 48 గంటల్లోనే రుణం మంజూరు అవుతుందని.. వడ్డీ యేడాదికి 11 % మాత్రమే అని మంత్రి తెలిపారు.
డిజిటల్, బయోమెట్రిక్ ప్రక్రియతో పాటు 2024-25 నుంచి 8 అక్టోబర్ 2026 వరకు సుమారు 17.96 లక్షల మంది మహిళలకు రూ.14,467.12 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో రూ.4,443.13 కోట్లు వసూలు కాగా.. గ్రామ సంస్థల కోసం రూ.6 కోట్ల విలువైన 30,000 బయోమెట్రిక్ పరికరాల పంపిణీ చేశామన్నారు. 98 % తో ఆదర్శవంతమైన రికవరీ రేటు కూడా నమోదైందని మంత్రి స్పష్టం చేశారు. SHG రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.17 లక్షలకు, గ్రామ సంస్థల పరిమితిని రూ.1.50 కోట్లకు పెంచామన్నారు.
పిల్లల చదువులు, వివాహాలకు 4% వడ్డీ రాయితీతో విద్యా, వివాహ రుణాలు మంజూరు చేయడంతో పాటు PMFME పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సబ్సిడీ రుణాలు, గిరిజన ప్రాంతాల మహిళలకు ప్రత్యేక స్వల్పకాలిక రుణాలు అందిస్తామన్నారు. 2026-27 సంవత్సరపు ఆర్థిక లక్ష్యంలో ఏకంగా రూ.3,000 కోట్లను కేవలం మహిళా పారిశ్రామికవేత్తల రుణాల కోసమే కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రుణగ్రహీత మరణిస్తే కుటుంబానికి ఆసరాగా లోన్ ప్రొటెక్షన్ మరియు ప్రమాదవశాత్తు మరణ సహాయ పథకం వర్తిస్తుందన్నారు. మహిళా సాధికారత, పారిశ్రామికాభివృద్ధి, మరియు డిజిటల్ ఆర్థిక భాగస్వామ్యానికి ‘స్త్రీనిధి’ని ఒక ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Tags: ‘Stree Nidhi’ gives a massive boost to DWCRA women entrepreneurs.