స్విమ్స్‌లో ‘చేంజింగ్ ది నేరేటివ్ ఆన్ సూసైడ్’పై అవగాహన కార్యక్రమం
తిరుపతి ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ ప్రొఫెసర్లు, మానసిక వైద్య నిపుణులను గుర్తించి టీటీడీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవారి వైద్య సేవలో స్విమ్స్‌ను మరింత భాగస్వామ్యం చేయాలని స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్విమ్స్ ఓపీడీ బ్లాక్‌లోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో సైకియాట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘చేంజింగ్ ది నేరేటివ్ ఆన్ సూసైడ్’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రముఖ నిపుణులు తమకు అనుకూలమైన సమయంలో స్విమ్స్‌కు వచ్చి మూడు రోజుల పాటు వైద్య సేవలు అందించేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల సేవల ద్వారా వైద్య విద్యార్థులు, పీజీ విద్యార్థులకు బోధనతో పాటు ఔట్‌పేషెంట్ విభాగంలో రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించవచ్చన్నారు. ఆయా విభాగాల భవిష్యత్ అభివృద్ధి, ఆధునిక వైద్య విధానాలపై నిపుణుల సలహాలు పొందడంతో వైద్య సేవలు, విద్య, పరిశోధన రంగాల్లో స్విమ్స్ మరింత అభివృద్ధి సాధించగలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బెంగళూరులోని నిమ్హాన్స్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఎం. ప్రత్యేక అతిథిగా పాల్గొని ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్యం, ఆత్మహత్య ఆలోచనలకు గురయ్యే వారిని ముందుగానే గుర్తించడం, వారికి సకాలంలో మానసిక సహాయం అందించడం తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
‘ప్రతి ప్రాణం విలువైనదే.. ప్రతి ఒక్కరికీ అండగా నిలుద్దాం’ అనే సందేశాన్ని ఈ సందర్భంగా అందించారు. మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో గుర్తించి వైద్య, మానసిక సహాయం అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఆత్మహత్యల నివారణలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్య సంస్థలు, సమాజం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించి సమస్యలో ఉన్నవారితో సానుభూతితో మాట్లాడి భరోసా కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో స్విమ్స్ వివిధ విభాగాల అధిపతులు, సైకియాట్రీ విభాగం వైద్యులు, అధ్యాపకులు, రెసిడెంట్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Prominent mental health experts from across the country should partner in providing medical services to Srivaru.