September 5, 2026
Explore
వరుస దొంగతనాల కేసుల్లో ఇద్దరి అరెస్టు

వరుస దొంగతనాల కేసుల్లో ఇద్దరి అరెస్టు

September 5, 2026 | Andhra Pradesh

రూ.13 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం

కల్లూరు ముచ్చట్లు:

కల్లూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.13 లక్షల విలువైన దొంగసొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. 106 రామిరెడ్డిగారిపల్లి గ్రామానికి చెందిన ఎం. శంకర్‌రెడ్డి ఇంట్లో మే 15న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి 8 గ్రాముల బంగారు గొలుసు, రూ.20 వేల నగదు అపహరించారు. దీనిపై కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా చిత్తూరు ఫింగర్‌ప్రింట్స్‌ బ్యూరో సిబ్బందితో పరిశీలన చేయించగా రొంపిచెర్ల మండలం దద్దాలవారిపల్లికి చెందిన ఆవులకుంట నరేష్ వేలిముద్రలుగా గుర్తించినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం పులిచెర్ల రైల్వే స్టేషన్ వద్ద నరేష్‌తో పాటు అతనికి సహకరించిన పిన్న బోయున శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నరేష్ 2025లో కొత్తపేటలోని అబ్దుల్ మునాఫ్ ఇంటితో పాటు, కల్లూరు–పులిచెర్ల రహదారిలో వగాళ్లవారిపల్లి సమీపంలోని ఎల్లమ్మ ఆలయం, 106 రామిరెడ్డిగారిపల్లి, బలిజిపల్లిలో ఏకాంబరం ఇంట్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పీలేరు, చంద్రగిరి మండలాల్లోని ఆలయాల్లోనూ దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు.

దొంగతనం చేసిన బంగారాన్ని వివిధ బంగారు ఆభరణాల దుకాణాల్లో విక్రయించేందుకు శ్రీనివాసులు సహకరించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి రూ.2.42 లక్షల నగదు, 78 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి కలిపి సుమారు రూ.13 లక్షల విలువైన దొంగసొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడీ ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ ఆధ్వర్యంలో కల్లూరు సీఐ ఎం. జయరామయ్య పర్యవేక్షణలో ఎస్‌ఐ యు. వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.

Tags: Two arrested in connection with a series of thefts.