అనకాపల్లి ముచ్చట్లు:
: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా అనుమతులు — ఎలాంటి చలానాలు చెల్లించనవసరం లేదు
కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా సులభతర విధానం
రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలు, పందిళ్లకు తప్పనిసరిగా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, స్పష్టం చేశారు. నిర్వాహకులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేకంగా సింగిల్ విండో ఈ-పోర్టల్ ప్రవేశపెట్టిందని తెలిపారు.
ఈ విధానం ద్వారా మండపాల ఏర్పాటు, లౌడ్ స్పీకర్లు, ఊరేగింపు మరియు నిమజ్జనానికి సంబంధించిన అన్ని అనుమతులను ఒకే చోట సులభంగా పొందవచ్చని, మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్‌లో అనుమతి పొందే విధానం:
దరఖాస్తు నమోదు:
నిర్వాహకులు కమిటీగా ఏర్పడి https://ganeshutsav.net వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘New Application’ పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరును నమోదు చేసి, వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
వివరాల నమోదు:
దరఖాస్తుదారుని పేరు, చిరునామా, కమిటీ/అసోసియేషన్ పేరు, ఈమెయిల్ ఐడీ.
మండపం ఏర్పాటు చేసే స్థలం, సంబంధిత సబ్ డివిజన్ మరియు పోలీస్ స్టేషన్ పరిధి వివరాలు.
గణేష్ విగ్రహం ఎత్తు, మండపం కొలతలు.
కమిటీ సభ్యుల వివరాలు, వారి ఫోన్ నంబర్లు.
నిమజ్జనం నిర్వహించే తేదీ, సమయం, రూట్ మ్యాప్ మరియు ఉపయోగించే వాహనాల వివరాలు.
క్షేత్రస్థాయి పరిశీలన:
దరఖాస్తు సమర్పించిన అనంతరం స్థానిక పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు.
ఎన్వోసీ (NOC) డౌన్‌లోడ్ & ప్రదర్శన:
అనుమతి మంజూరైన తర్వాత https://ganeshutsav.net/applicationStatus లింక్‌లో మొబైల్ నంబర్ ఎంటర్ చేసి నిరభ్యంతర పత్రం (NOC) మరియు క్యూఆర్ (QR) కోడ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
డౌన్‌లోడ్ చేసుకున్న ఎన్వోసీ, నిబంధనలతో కూడిన పత్రాన్ని లామినేషన్ చేయించి, తనిఖీకి వచ్చే అధికారుల పరిశీలనార్థం మండపం వద్ద స్పష్టంగా కనిపించేలా ఉంచాలి.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, ప్రమాదాలు మరియు ఘర్షణలకు తావులేకుండా పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసు శాఖకు ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు.
Tags: Permissions via the single-window system are mandatory for setting up Ganesh festival pandals.